అమరావతి: అనంతపురం జిల్లా బడన్నపల్లిలో హత్యకు గురైన దళిత యువతి స్నేహలత కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సాయం ప్రకటించారు. స్నేహలత కుటుంబానికి చట్టపరంగా వచ్చే సాయంతో పాటు అదనంగా రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా త్వరితగతిన కేసును దర్యాప్తు చేయాలని పోలీసు శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఒకరికి ఉద్యోగం.. 5 ఎకరాల పొలం: కలెక్టర్, మంత్రి
స్నేహలత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.4,12,500లు మంజూరు చేసినట్లు రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బాధిత కుటుంబానికి ఇల్లు, ఇంటి స్థలం అందజేస్తామన్నారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు 5 ఎకరాల పొలం ప్రకటించారు. అంతేకాకుండా మూడు నెలలకు పైగా సరిపడా నిత్యావసర సరుకులు, వంటపాత్రలు అందజేయనున్నట్లు మంత్రి, కలెక్టర్ వెల్లడించారు.