end

ఇన్నేళ్లు దేశానికి ఆడటం కంటే గొప్పేముంటుందిః ధావన్‌

శిఖర్‌ ధావన్.. ఈ పేరు వినపడగానే టీమిండియా ఎడమచేతి వాటం ఓపెనర్‌ గుర్తొస్తాడు. దూకుడుగా ఆడే ధావన్‌.. రోహిత్‌ శర్మతో కలిసి ఎన్నో అద్భుత భాగస్వామ్యాలు నెలకోల్పాడు. ధావన్‌ టీమిండియాలోకి వచ్చి నేటితో సరిగ్గా 10 సంవత్సరాలవుతోంది. ధావన్‌ను టీమ్‌ సభ్యులు, అభిమానులు ‘గబ్బర్‌’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ సందర్భంగా ధావన్‌ ట్విట్టర్‌లో ఓ భావోద్వేగ పోస్టు చేశాడు. 10 సంవత్సరాలు టీమిండియాతో ఉన్నా. ఇన్ని సంవత్సరాలు దేశానికి ఆడడం కంటే గప్పేముంటుంది. దేశానికి ప్రాతినిథ్యం వహించడం నా జీవితంలో గొప్ప జ్ఞాపకం. అందుకు నేను సర్వదా ధన్యున్ని అని ట్విట్టర్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

శిఖర్‌ ధావన్‌ 2004 అండర్‌ 19 ప్రపంచకప్‌లో 505 పరుగులు చేశాడు. ఈ టోర్నీతో ఈ కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సమయంలోనే టీమిండియాలోకి ఎంపికవుతాడని అనుకున్నారు. కానీ, అప్పటి జట్టు చాలా పటిష్టంగా ఉంది. దీంతో శిఖర్‌కు అప్పుడు జట్టులో స్థానం లభించలేదు. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. తన తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌ అయినా, తదుపరి మ్యాచుల్లో తన దూకుడైన బ్యాటింగ్‌తో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

ఇప్పటివరకు ధావన్‌ 136 వన్డేలాడి 45 సగటుతో 5,688 పరుగులు చేశాడు. 2011లో టీ20 జట్టులోకి, 2013లో టెస్టు జట్టులోకి ఎంపికైన ధావన్‌ రెగ్యులర్‌ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. 34 టెస్టులాడిన గబ్బర్‌.. 40 సగటుతో 2,315 పరుగులు చేశాడు. 61 టీ20 మ్యాచుల్లో 1,588 పరుగులు రాబట్టాడు.

శిఖర్‌ ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్నాడు. తొలిసారి ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన శిఖర్‌.. తర్వాత ముంబయి ఇండియన్స్‌ జట్టుకు ఆడాడు. అనంతరం ధావన్‌ను హైదరాబాద్‌ జట్టు సొంతం చేసుకుంది. ప్రస్తుతం మళ్లీ డీసీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో మొత్తం 169 మ్యాచ్‌లాడిన ధావన్‌.. 35 సగటుతో, 126 సగటుతో 5,044 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలు బాది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఏదేమైనా ఈ సందర్భంగా మన గబ్బర్‌కు మనం శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే. కంగ్రాట్యులేషన్స్‌ మిస్టర్‌ గబ్బర్‌.

Exit mobile version