ప్రస్తుత ఏడాది నవంబర్‌లో భారత రత్నాభరణాల(Jewellery) ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. దీపావళి పండుగ తర్వాత తయారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో వృద్ధి కనబడుతోందని రత్నాభరణాల ఎగుమతి(Export) ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) సోమవారం ప్రకటనలో తెలిపింది. జీజేఈపీసీ తాజా వివరాల ప్రకారం, గత నెలలో రత్నాభరణాల ఎగుమతులు 11.83 శాతం పెరిగి రూ. 19,855.17 కోట్లకు చేరుకున్నాయి.
గతేడాది ఇదే నెలలో రూ. 17,755.28 కోట్ల విలువ రత్నాభరణాల ఎగుమతులు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్(April-November) మధ్యకాలంలో మొత్తం రత్నాభరణాల ఎగుమతులు గతేడాదిలో జరిగిన రూ. 1.92 లక్షల కోట్లతో పోలిస్తే 8.26 శాతం పుంజుకుని రూ. 2,08,040 కోట్లకు పెరిగాయి. ఏప్రిల్-నవంబర్ మధ్య ఎగుమతుల వృద్ధికి యూఎస్, హాంకాంగ్ దేశాలు(Hong Kong countries) ప్రధాన మద్దతుగా నిలిచాయి. ఈ కాలంలో అమెరికా(America)కు రూ. 76 వేల కోట్లు, హాంకాంగ్‌కు రూ. 47 వేల కోట్ల విలువైన రత్నాభరణాల ఎగుమతులు జరిగాయని జీజేఈపీసీ ఛైర్మన్ విపుల్ షా అన్నారు. అలాగే, కట్ అండ్ పాలిష్ వజ్రాల(Cut and polished diamonds) ఎగుమతులు నవంబర్‌లో 4.97 శాతం పెరిగి రూ. 10,202.54 కోట్లకు చేరుకున్నాయి. అదే, ఏప్రిల్-నవంబర్ కాలానికి 1 శాతం పెరిగి రూ. 1,21,602.56 కోట్లకు చేరాయి.