క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్! భారత్, వెస్టిండీస్ రెండో టీ20 మరో రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. లగేజీ పరమైన ఇబ్బందులతో మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తామని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవ్వాల్సిన మ్యాచ్ రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. జట్లకు అవసరమైన ముఖ్యమైన లగేజీ ట్రినిడాడ్ నుంచి సెయింట్ కీట్స్‌కు ఆలస్యంగా వచ్చింది. ఫలితంగా రెండో టీ20 స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు భారత్‌లో రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. అభిమానులు, స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టింగ్ భాగస్వాములకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం. స్టేడియం గేట్లు 10 గంటలకు తెరుస్తారు. టికెట్లు అందుబాటులో ఉన్నాయి అని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది. వెస్టిండీస్‌లో భారత్ పర్యటిస్తే బ్రాడ్‌కాస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపించరు. ఇక్కడి, అక్కడి సమయానికి చాలా వ్యత్యాసం ఉండటమే కారణం. అక్కడ ఉదయం అయితే ఇక్కడ రాత్రి అవుతుంది. అందుకే స్టార్ స్పోర్ట్స్, సోనీ ఛానెళ్లు బిడ్డింగ్ వేయలేదు. దాంతో దూరదర్శన్‌లో లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. ఫ్యాన్‌కోడ్‌లో లైవ్ స్ట్రీమింగ్ వస్తోంది.