- కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
- విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ
- శానిటైజేషన్, కోవిడ్ నిబంధనలు తప్పనిసరి
దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ర్టంలో 9, 10 ఆపై తరగతులు జరగడానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కేసీర్ మరో ముందడుగు వేసి బుధవారం నుండి 6,7,8 తరగతులు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. కోవిడ్, కరోనా వైరస్ వల్ల గత సంవత్సరం విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులకు అనుమతినిచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. విద్యార్థులకు కూడా సంతృప్తికరంగా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు వాపోయారు.
చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కాకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇదిలావుండగా బుధవారం నుంచి 6,7, 8 తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి మార్చి 1లోగా తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో కోవిడ్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. అయితే పాఠశాలలు తెరుచుకుంటుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మిగత కింది తరగతులను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
విద్యార్థులు ఈ ఏడాది పూర్తిగా నష్టపోకుండా కొన్ని కొన్ని తరగతులను ప్రారంభం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ తరగతుల విద్యార్థులు కూడా పాఠశాలలకు రావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది. అలాగే పాఠశాల తరగతి గదుల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధ్యాపకులు, విద్యార్థులు తప్పకుండా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.