ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్-19, కరోనా వైరస్ ఇప్పుడు అండమాన్ దీవుల్లోకి కూడా వ్యాప్తి చెందింది. గ్రేటన్ అండమానీస్ తెగకు చెందిన నలుగురు వ్యక్తులకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే వీరిని ఆసుపత్రిలో చేర్పించారు. మరో ఇద్దరిని హోం క్యారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. అయితే గ్రేటర్ అండమానీస్ తెగ జనాభా కేవలం 53 మంది మాత్రమే. వీరంతా ఆర్చిపిలాగో దీవుల్లో నివసిస్తున్నారు.
ఇప్పటి వరకు అండమాన్ నీకోబార్ దీవుల్లో మొత్తం 2985 కరోనా కేసులు నమోదవగా, ఆ కేసుల్లో 41 మరణాలు సంభవించాయి. పోర్ట్ బ్లెయిర్ వద్ద ఉన్న స్ట్రెయిట్ ఐలాండ్‌లో 53 మందికి కరోనా టెస్టులు చేశారు. అండమాన్ దీవుల్లో మొత్తం 5 రకాల ఆదిమ తెగలు ఉన్నాయి. జారావాస్, నార్త్ సెంటినలీస్, గ్రేటర్ అండమానీస్, ఓంగే, షోంఫెన్ తెగలు ఉన్నాయి. దీంట్లో జారావాలు, నార్త్ సెంటినలీస్ ప్రజలు మాత్రం ఇంకా సాధారణ జనజీవితంలోకి చేరలేదు.