- కోర్టుకు నివేదించిన యూపీలోని మధుర పోలీసులు
- ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు
పోలీస్ స్టేషన్ (Police station)లో ఉన్న 581 కేజీల గంజాయి (Marijuana)ని ఎలుకలు (Rats) తినేశాయంటే ఆశ్చర్యపోతున్నారు కదూ. మీరు నమ్మలేకున్నా ఇదే నిజం. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా కోర్టుకు (Court)చెప్పారు. ఓ కేసు విచారణలో భాగంగా పట్టుబడిన గంజాయిని అప్పగించాలన్న యూపీ (UP)లోని ప్రత్యేక కోర్టు ఆదేశాలకు మధుర పోలీసులు (Mathura Police) ఆశ్చర్యకర సమాధానం ఇచ్చారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న 581 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పేర్కొంటూ, స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (1985) (Special Narcotic Drugs and Psychotropic Substances Act) కోర్టుకు నివేదిక సమర్పించారు.
అలాగే తమకు పట్టుబడిన మత్తు పదార్థాలను మధుర పట్టణంలోని షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్ (Shergarh Police Station)లో 386కిలోలు నిల్వ చేయగా, హైవే పోలీస్ స్టేషన్ (Highway Police Station)లో 195 కిలోలు నిల్వ చేశామని, అయితే ఈ మొత్తం గంజాయినీ ఎలుకలు తిన్నాయని పేర్కొన్నారు. వీరి నివేదికపై స్పందించిన ప్రత్యేక కోర్టు శనివారంలోగా అందుకు తగిన ఆధారాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాగా, ఎలుకలు తిన్నాయని చెబుతున్న గంజాయి విలువ సుమారు రూ.60లక్షలు కావడం గమనార్హం. పోలీసుల నివేదిక చూసి విస్తుపోయిన అదనపు జిల్లా జడ్జి.. అయితే అందుకు తగిన సాక్ష్యాన్ని (Proofs) ఈ నెల 26వ తేదీలోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అయితే, హైవే పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చోటె లాల్ (inspector Chote Lal)కథనం మరోలా ఉంది. అక్టోబరులో కురిసిన భారీ వర్షాల (Heavy rain in October) కారణంగా గోదాములోకి నీళ్లు చేరి గంజాయి మొత్తం పాడైపోయిందని అన్నారు. షేర్‌గఢ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సోను కుమార్ కూడా ఇలాంటి కారణమే చెప్పడం కొసమెరుపు.