- బిజేపి ఎత్తుగడలకు బేజారవుతున్న టీఆర్ఎస్
- కొత్త కొత్త ప్లాన్లతో ప్రజల్లోకి వస్తున్న నాయకులు
- ప్రత్యామ్నాయ పార్టీగా ప్రచారంపై గుబులు
భారతీయ జనతా పార్టీ (BJP)చేపడుతున్న కార్యక్రమాలు టీఆర్ఎస్ (TRS) పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. వాటిని ఎదుర్కోవడంలో స్ట్రాటజీ వికటిస్తున్నదనే టాక్ వస్తున్నది. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో సిద్దహస్తుడని పేరున్న కేసీఆర్ (KCR).. బీజేపీ విషయంలో తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు ఫెయిలైనట్టు చర్చ జరుగుతున్నది. కొన్నిసార్లు బీజేపీ ట్రాప్‌లో పడిన సందర్భాలూ ఉన్నాయన్న కామెంట్లు వస్తున్నాయి. దీంతో బీజేపీ కార్యక్రమాలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిదని సొంత పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ (Assembly)ఎన్నికల్లో ఎలాగైన అధికారాన్ని సొంతం చేసుకోవాలని లక్ష్యంతో బీజేపీ ఉంది. ఇందుకోసం విస్తృత స్థాయిలో ప్రోగ్రామ్స్‌ను ప్లాన్ చేస్తున్నది. వాటిని ఎదుర్కుంటే ఏ సమస్య వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నది.
పద్మవ్యూహంలో గులాబీ దళం చిక్కుకున్నది. అణచివేస్తే ఎగిసిపడుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నది. కమలనాథుల ఎత్తుగడలను అంచనా వేయలేక బేజారవుతున్నది. యాత్రలను అడ్డుకుంటే సానుభూతి వస్తుందనే టెన్షన్‌తోపాటు అనుమతి ఇస్తే ఎక్కడ బలం పుంజుకుంటుందోనన్న బెంగ కూడా వెంటాడుతున్నది. ఆ పార్టీ అమలు చేస్తున్న వ్యూహాల(strategies)తో టీఆర్ఎస్ పెద్దలు ఆగం అవుతుండటమే కాకుండా ప్రత్యామ్నాయ పార్టీగా ప్రచారం జరుగుతుండటంతో గులాబీ శ్రేణుల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.
మౌనంగా ఉంటే సమస్యే
బీజేపీని వదిలేస్తే ఆ పార్టీ ప్రజల్లో మరింత బలపడే ప్రమాదం ఉందన్న టెన్షన్ ఆ పార్టీ నేతలందరిలో వ్యక్తమవుతున్నది. అందుకే బీజేపీ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ప్రచారంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లను సొంతం చేసుకోవడంతోనే టీఆర్ఎస్కు ప్రత్యామ్నయ పార్టీ గా చర్చల్లో నిలిచింది. ఆ తర్వాత జరిగిన హుజూరాబాద్ (Huzurabad) బై ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender)భారీ మెజార్టీతో విజయం సాధించడంతో.. మునుగోడు (Munugode) ఉప ఎన్నికలో టీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం అక్కడే మకం వేసింది. రాత్రింబవళ్లు కష్టపడినా కేవలం పదివేల ఓట్ల మెజార్టీతోనే గెలిచింది. బీజేపీ బలం రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ఏదో సాకుతో తమ కార్యక్రమాలను టీఆర్ఎస్ అడ్డుకుంటున్నట్టు ఆ పార్టీ విమర్శలు చేస్తున్నది.
(CM KCR:సీఎస్టీ పన్ను బకాయిలు రద్దు)
అడ్డుకుంటే సానుభూతి
మరోవైపు బీజేపీని అడ్డుకుంటే ఆ పార్టీకి సానుభూతి వచ్చే ప్రమాదం లేకపోలేదన్న చర్చ జరుగుతున్నది. 317 జీవోకు (JIVO) వ్యతిరేకంగా బీజేపీ పలు అందోళన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా బండి సంజయ్ (Bandi sanjay) కరీంనగర్ (Karimnagar)లోని పార్టీ ఆఫీసులో మౌన దీక్ష చేపట్టే సమయంలో అనుమతి లేదని అభ్యంతరం చెప్పారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు తలుపులు బద్దలుకొట్టి మరీ పోలీసులు (Police)లోనికివెళ్లారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అందోళనలు చేశాయి. మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్ర పాలకుర్తి (Palakurthi) అసెంబ్లీ సెగ్మంట్ చేరుకున్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీ శ్రేణుల భీకరంగా తలపడ్డాయి. యాత్ర కొనసాగిస్తే శాంతి భద్రత సమస్యలు వస్తాయని కారణంతో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు. దీంతో కోర్టుకు (Court) వెళ్లి యాత్రకు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు ఐదో విడత యాత్ర సమయంలోనూ పోలీసులు అడ్డుకోవడంతో కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. బీజేపీ కార్యక్రమాలను పదే పదే అడ్డుకోవడం వల్ల ప్రజల్లో ఆ పార్టీకి సానుభూతి వస్తుందన్న చర్చ జరుగుతున్నది.
వికటిస్తున్న లాస్ట్ మినిట్ డెసిషన్స్
బీజీపీ కార్యక్రమాలపై చివరి నిమిషంలో తీసుకుంటున్న నిర్ణయాలు వికటిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. కరీంనగర్లో మౌనదీక్షకు బండి సంజయ్ముందుగానే లోకల్ పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయన దీక్షకు సిద్దం అవుతున్న సమయంలో అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అందోళనలు చేపట్టింది. ఐదో విడత పాదయాత్ర (Pada yatra)విషయంలో కూడా చివరి నిమిషంలో అడ్డుకోవడం.. ఆ పార్టీకే మైలేజ్ వస్తుందనే టాక్ పార్టీలోనే వ్యక్తమవుతున్నది. భైంసా (Bainsa)పట్టణంలో పాదయాత్ర చేపడితే శాంతిభద్రతల సమస్య వస్తుందని.. రూట్ మ్యాప్ (Route map)మార్చాలని పోలీసులు ముందుగానే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని చర్చ జరుగుతున్నది.