- లిక్కర్ స్కామ్‌లో కవిత స్పందనపై చర్చ
- 91 సీఆర్‌పీసీ నోటీసుకు ఆమె రిప్లై ఏంటి?
- డిజిటల్ ఎవిడెన్సుపైనే ఎంక్వైరీ టీమ్ ఫోకస్
- వివరాలు సంతృప్తిగా లేకుంటే యాక్షనేంటి?
- చర్చనీయాంశంగా మారిన దర్యాప్తు ప్రక్రియ
ఢిల్లీ మద్యం కుంభకోణం(Liquor scam)లో సీబీఐ జారీ చేసిన నోటీసుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) రిప్లై ఇస్తారా? స్వయంగా వెళ్లి అందజేస్తారా?.. లేక ఎవరితోనైనా పంపిస్తారా?.. ఎలాంటి ఎవిడెన్సులను, డాక్యుమెంట్లను సీబీఐ(CBI) కోరింది? కవిత దగ్గర ఏమేం ఆధారాలున్నాయని అధికారులు భావించారు?.. వాటిన్నింటినీ ఆమె ఇస్తారా?.. ఇవ్వకపోతే సీబీఐ ఎలా రియాక్ట్(React) అవుతుంది?.. మరోమారు వివరణ కోసం ఆమెను సంప్రదిస్తుందా? అన్నది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సాక్షిగా మాత్రమే విచారించిన సీబీఐ.. ఇప్పుడు ఆమె నుంచి డిజిటల్ ఎవిడెన్సులతో పాటు డాక్యుమెంట్లు, ఇతర సాక్ష్యాధారాలను కూడా అందజేయాలనటం సరికొత్త సందేహాలకు తావిచ్చినట్లయింది. కొన్ని డాక్యుమెంట్లు, ఎవిడెన్సు(Evidence), మెటీరియల్ లాంటివి ఉన్నాయని సీబీఐ బలంగా విశ్వసిస్తున్నందునే వాటిని ఇవ్వాలని సూచించినట్టు నోటీసుల(Notice) ద్వారా స్పష్టమవుతున్నది.
ఇదిలా ఉండగా ఈ స్కామ్(Scam)కు సంబంధించి పది వేల పేజీల చార్జిషీట్(Chargesheet)ను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో సీబీఐ గత నెల 25న సమర్పించింది. చార్జిషీట్ లోని వివరాలు ఇంకా బయటికి వెల్లడి కాలేదు. కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఇదివరకే సీబీఐ విచారించింది. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ నిర్వహించే రాబిన్ డిస్టిల్లరీ కంపెనీకి కూడా బుచ్చిబాబే(Buchi babu) ఆడిటర్‌గా వ్యవహరించారు. ఈ స్కామ్‌లో అవినీతి, అవకతవకలు జరిగాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న సీబీఐ ఢిల్లీ ఎక్సయిజ్ అధికారులకు ముడుపుల రూపంలో భారీగా డబ్బు ముట్టిందని వివరించింది. ఇదే కేసులో బోయిన్‌పల్లి అభిషేక్‌ను విచారించిన సీబీఐ ఎవరెవరి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో ఆరా తీసింది. ఇప్పుడు కవితను విచారించిన సందర్భంగా ఈ అంశాలను కూడా సీబీఐ ప్రస్తావించి వాటికి సంబంధించిన అదనపు వివరాలను రాబట్టినట్లు సమాచారం. ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఫోన్ సంభాషణలు(Phone Conversation) జరిపారు..? ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన సమయంలో ఎన్నిసార్లు ఢిల్లీ(Delhi)కి వెళ్ళి వచ్చారు.? ఎవరెవరిని ఎక్కడ కలిశారు? ఏమేం చర్చించారు? వాట్సాప్‌ల ద్వారా లిక్కర్ పాలసీ ముందుగానే కొద్దిమంది ఫోన్లకు చేరినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో కవితకూ చేరిందా… ఇలాంటి వివరాలన్నింటినీ సీఆర్‌పీసీ 91 కింద ఆమె నుంచి కోరినట్లు తెలిసింది.
(Big blow to Congress:కాంగ్రెస్‌కు భారీ ఝలక్)
ఇక గతంలో తిరుమల ఆలయాన్ని సందర్శించినప్పుడు కవిత దిగిన ఫొటోల్లో అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో పాటు బోయిన్‌పల్లి అభిషేక్ కూడా ఉన్నారు. వీరితో ఉన్న పరిచయానికి సంబంధించిన వివరాలను కూడా సీబీఐ ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ(Delhi Excise Department) బాధ్యతలను చూస్తున్న మనీష్ సిసోడియాతో కవితకు ఉన్న పరిచయాల గురించి కూడా సీబీఐ ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్ సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, మొబైల్ ఇన్‌స్ట్రుమెంట్‌లను అందించడం, వాట్సాప్ లేదా ఇతర మెసెంజర్ యాప్‌ల ద్వారా షేర్ చేసుకున్న డాక్యుమెంట్లు, చాటింగ్ డాటా.. ఇలాంటివాటిపై సీబీఐ ఫోకస్(Focus) పెట్టింది. సీఆర్‌పీసీ 91 కింద సీబీఐ కోరిన సమాచారాన్ని కవిత ఏ మేరకు అందిస్తారు.. వాటితో సీబీఐ అధికారులు సంతృప్తి చెందుతారా..? మరోసారి వాటిని ఇవ్వాల్సిందిగా నోటీసు ఇస్తారా..? తన దగ్గర లేవనే సమాధానమిస్తే సీబీఐ ఇకపైన ఎలా వ్యవహరిస్తుంది? ఇవే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నోటీసుల పర్వం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది.. సీబీఐ తదుపరి స్టెప్ ఎలా ఉండబోతున్నదనేది చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఈడీ అధికారులు కూడా మనీ లాండరింగ్(Money laundering), ఆర్థిక లావాదేవీల వివరాలపై పలువురిని అరెస్టు చేసి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. అమిత్ అరోరాను కస్టడీలోకి తీసుకోడానికి ప్రత్యేక కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పది ఫోన్లను రెండు నెంబర్లతో వాడినట్లు పేర్కొన్నది. ఇకపై ఈడీ కూడా తన దర్యాప్తులో భాగంగా ఈ ఫోన్ల వివరాలను, ‘సౌత్ గ్రూపు’ ద్వారా ఢిల్లీ ఎక్సయిజ్ అధికారులకు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు దొడ్డిదారిన తరలిన డమ్బుల వివరాలను రాబట్టే అవకాశమున్నది. సౌత్ గ్రూపులో కవిత పేరు కూడా ఉన్నట్లు ఈడీ ఇప్పటికే ఆ రిమాండ్ రిపోర్టు(Remand Report)లో పేర్కొనడంతో భవిష్యత్తులో నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏక కాలంలో సీబీఐకు సీఆర్‌పీసీలోని సెక్షన్ 91 ప్రకారం కవిత సమర్పించే సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లతో పాటు సందేహాల నివృత్తి కోసం ఈడీ ఆమెను విచారణకు పిలిస్తే వెల్లడించే వివరాలేంటనేది ఆసక్తికరంగా మారింది.
ఈ వ్యవహారం దాదాపు ఏడాది పాటు (తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు) కొనసాగుతుందని గులాబీ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో ఇకపై నోటీసులు రావడం, విచారణకు హాజరుకావడం రోటీన్ ప్రాక్టీసు(Routine practice)గా మారుతుందేమోననే అనుమానం ఆ పార్టీ నేతల మధ్యనే గుసగుసలకు తావిచ్చినట్లయింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలను కేసీఆర్(KCR) మొదలుపెట్టిన తరుణంలో ఆయన కుమార్తెపై ఇలాంటి ఆరోపణలు రావడం, నోటీసులు, విచారణలు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.