- 9 జిల్లాల్లోని గర్బిణులకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
- రూ. 50 కోట్లతో గర్బిణులకు వరంగా మరో అద్భుతమైన పథకం
- కామారెడ్డి నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
- ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్(KCR KIT) సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల(Nutrition Kit)కు రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి (బుధవారం) నుంచి 9 జిల్లాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. న్యూట్రీషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు(Harish Rao).. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వర్చువల్ మోడ్‌లో ప్రారంభిస్తారు. ఇదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
జిల్లా మంత్రి
ఆదిలాబాద్ ఇంద్రకరణ్ రెడ్డి
కుమ్రంభీం ఆసిఫాబాద్ బాల్క సుమన్, ప్రభుత్వ విప్
భద్రాద్రి కొత్తగూడెం పువ్వాడ అజయ్
ములుగు సత్యవతి రాథోడ్
జయశంకర్ భూపాలపల్లి ఎర్రబెల్లి దయాకర్ రావు
వికారాబాద్ సబిత ఇంద్రారెడ్డి
నాగర్ కర్నూల్ శ్రీనివాస్ గౌడ్
గద్వాల్ నిరంజన్ రెడ్డి
9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు.. అత్యధికంగా ఎనీమియా (Anemia-రక్త హీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అంచనాల ప్రకారం, 1.25 లక్షల మంది గర్బిణులకు ఇది ఉపయోగపడనుంది. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నది.
ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్(Vitamins) లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కో కిట్‌కు రూ. 1962 తో రూపొందించి, కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్(ANC Checkup) సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వడం జరుగుతుంది. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పంపిణీ చేస్తున్నది.
న్యూట్రీషన్ కిట్లలో ఉండేవి…
1, కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్
2, కిలో ఖర్జూర
3, ఐరన్ సిరప్ 3 బాటిల్స్
4, 500 గ్రాముల నెయ్యి
5, ఆల్బెండజోల్ టాబ్లెట్
6, కప్పు
7, ప్లాస్టిక్ బాస్కెట్
ఎనీమియా నుంచి విముక్తి..
రక్త హీనత (ఎనీమియా) గర్బిణుల(Pregnant Ladies) పాలిట శాపంగా మారుతున్నది. గర్బిణులకు ప్రసవాలు(Delivery) సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎనీమియా నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో గొప్ప వృద్ధిని నమోదు చేసింది. ఈనెలలో కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, మాతృ మరణాల రేటు(Maternal mortality rate) 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకాన్ని అమలు చేస్తున్నది. తొలిదశలో భాగంగా గర్బిణుల్లో ఎనీమియా ప్రభావం ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది.
జిల్లా ఎనీమియా (శాతం)
ఆదిలాబాద్ 72
భద్రాద్రి కొత్తగూడెం 75
జయశంకర్ భూపాలపల్లి 66
జోగులాంబ గద్వాల్ 82
కుమ్రంభీం 83
ములుగు 73
నాగర్ కర్నూల్ 73
కామారెడ్డి 76
వికారాబాద్ 79
గర్బిణులకు వరంగా ప్రభుత్వ చర్యలు… మాతా శిశు సంరక్షణలో భాగంగా కేసీఆర్ కిట్ల పథకాన్ని దేశంలో ఎక్కడా లేనట్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు 13,90,634 మంది లబ్ధిదారులకు, రూ. 243 కోట్లు విలువ చేసే 12,85,563 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. రూ. 1261.61 కోట్లను ఆర్థిక సాయం కింద, డీబీటీ(DBT) ద్వారా ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ కిట్ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. .. ఇలాప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు(Deliveries in government hospitals) గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ఏర్పడ్డ నాడు 30శాతంగా ఉన్న ప్రసవాలు గణనీయంగా పెరిగి, ఇప్పుడు 66 శాతానికి చేరాయి. ఇదే సమయంలో అనవసర సి- సెక్షన్ల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తున్నది. ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు గర్బిణులకు వరంగా మారనున్నాయి.