- భారీ మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు సమాచారం
తెలుగు (Telugu state) రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. సిటీ వాసులంతా గ్రామాల బాట పట్టడంతో పండుగ వేళ పల్లెలు కొత్త శోభ సంతరించుకున్నాయి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా.. తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఏపీలో భోగి మంటలు ముగిసిన వెంటనే కోడి పందేలు (Kodi pandaalu) జోరందుకున్నాయి. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల పందేలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో భారీ మొత్తంలో డబ్బు చేతులు మారుతోంది.
ముఖ్యంగా ఉభయ గోదావరి (Ubayagodari) జిల్లాలు, గుంటూరు, కృష్ణా (Guntur, Krishna)లో.. సంక్రాంతి సంబరాల పేరుతో బోర్డులు పెట్టి.. లోపల కోడి పందేలు నిర్వహిస్తున్నారు. అందరూ వీక్షించేందుకు ఎల్ఈడీ (LED) స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చాలా చోట్ల బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా కోడి పందేలా నిర్వహణ చాలా ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుండగా కొన్ని చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులకి నేతల నుంచి ఒత్తిడులు ఎదురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
కోనసీమ (konaseema) జిల్లా రావులపాలెంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వీటిని తిలకించేందుకు, పందేల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో… సమాచారం అందుకున్న పోలీసులు (police) నిర్వహణను అడ్డుకునేందుకు రావులపాలెం వచ్చారు. కోడి పందేల నిర్వహణ చట్ట విరుద్ధమని, నిలిపివేయాలని ఆదేశించగ అక్కడే ఉన్న కొత్తపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పోలీసులపై మండిపడ్డారు. పందేల నిర్వహణను ఆపే ప్రసక్తే లేదని ఎన్ని కేసులు అయిన పెట్టుకోండి అంటూ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రైవేటు స్థలమని.. ఇక్కడ మీకేం పని అంటూ సీరియస్ అయ్యారు. పల్నాడు జిల్లా.. ముస్సాపురంలో కోడి పందేలను అడ్డుకున్న పోలీసులతో వైఎస్సార్సీపీ నాయకురాలు జయమ్మ (YSRCP leader Jayamma) వాగ్వాదానికి దిగారు. మరికొన్ని చోట్లా ఇలాంటి ఘటనలే జరిగాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, జూదం, ఇతర నిషేధిత ఆటలకు పాల్పడవద్దని పోలీసులు స్పష్టం చేశారు. పోస్టర్లు, బ్యానర్లు (Posters, banners) ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కోడి పందాలు నిర్వహించినా, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే.. నిర్వాహకులు మాత్రం పోలీసుల ఆదేశాలపై సీరియస్ అవుతున్నారు. చట్టాల పేరుతో సంప్రదాయాన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల ఆదేశాలు ఎలా ఉన్నా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాల నిర్వహణకు భారీ సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజలకు, సామాన్యులకు ప్రవేశం లేని విధంగా భారీ ఎంట్రీ ఫీజులు నిర్ణయించారు. గతేడాది సంక్రాంతికి గుడివాడలో కేసినో నిర్వహించిన తరహాలో.. ఈ సారి కూడా పలు చోట్ల ఆ తరహా ఈవెంట్లకు ఏర్పాట్లు జరిగాయి. కోడి పందాలు ఒకనాడు సరదా. ఆ తర్వాత సంప్రదాయంగా మారింది. కానీ వర్తమానంలో ఇదో పెద్ద ఉపాధి మార్గం అయింది. అంతకుమించిన వ్యాపారంగా తయారయ్యింది.
పందాల కోసం కోళ్లను తయారుచేయడం. కత్తులను సిద్ధం చేయడం వంటి వృత్తుల్లో వందల మంది ఉన్నారు. ఏడాది పొడవునా కోళ్లను పందాలకు సిద్ధం చేసే ప్రక్రియలో అనేకమంది ఉపాధి పొందుతున్నారు. పందెం కోడిని గుర్తించడం, దానికి తగిన ఆహారం అందించడం, కసరత్తులు చేయించి, పందాలకు పురిగొల్పడం ఓ విద్యగా మారింది. అది తెలిసిన వారికి గ్రామాల్లో కొంత గిరాకీ కూడా ఉంటుంది.పందాలకు బరులు ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతంలో ఓ జాతర మాదిరిగా తినుబండారాలు, మద్యం షాపుల నిర్వహణతో పాటుగా అవకాశం ఉంటే గుండాటకి సిద్ధం చేయడం వంటివి పెద్ద వ్యవహారాలు. వాటి ద్వారా కోట్లలో వ్యాపారం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలో 2022 సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బరి సమీపంలో బెల్ట్ షాప్ (best shop) నిర్వహణకు ఏర్పాటు చేసిన వారికి సుమారుగా రూ.12 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
బరులు వివిధ కేటగిరీలుగా ఉంటాయి. పెద్ద బరులు అంటే బడా నాయకులు, సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. అలాంటి బరుల్లో రోజుకి ఒక్కో చోట నాలుగైదు కోట్ల రూపాయల పందాలు జరుగుతాయి. మధ్య తరహా బరులు కూడా ఉంటాయి. అక్కడయితే రూ. 50 లక్షల నుంచి కోటి వరకూ పందాలు జరుగుతాయి. సామాన్యులు కూడా చిన్న చిన్న బరులు నిర్వహిస్తుంటారు. అక్కడ మొత్తం రోజంతా కలిపితే రూ. 10, 15 లక్షల పందాలు జరుగుతాయి. మూడు రోజులకు కలిపి పెద్ద బరుల్లో రూ. 15 కోట్ల వరకూ పందాలు జరుగుతాయియఅంటూ ఆయన వివరించారు. పందాలతో పాటుగా గుండాటలో కూడా లక్షల రూపాయలు చేతులు మారుతాయి. మద్యం అమ్మకాలు, మాంసం సహా ఇతర సరుకుల అమ్మకాలు కూడా విస్తృతంగా ఉంటాయి. వాటిని అమ్ముకునే వారు బరి నిర్వహాకులకు ముందుగా అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
పెద్ద బరుల దగ్గర ఫ్లడ్ లైట్లు, ఫెన్సింగ్, స్టేజీ ఏర్పాట్లుంటాయి. వాటన్నింటినీ పది పదిహేను రోజుల ముందు నుంచే సిద్ధం చేస్తారు. వాటి ఏర్పాట్ల కోసం నిర్వాహకులు లక్షల రూపాయలు వెచ్చిస్తారు.ఒక్కో బరిలో కనీసంగా గంటకు నాలుగైదు పందాలు నడుస్తాయి. రోజులో 100 పందాల వరకూ సాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రతీ పందెంలోనూ గెలిచిన వారు అందులోంచి కొంత మొత్తం నిర్వాహకులకు అందించాలి. ఒక్కో ప్రాంగణంలో మూడు, నాలుగు బరులు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇతర వ్యాపారాలు కూడా నిర్వాహకులకు పెద్దమొత్తంలో అందించాలి.
వందల కోట్లు దాటే పందాలు:
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నుంచి బాపట్ల జిల్లా వరకూ ఈ కోడిపందాల ప్రభావం కనిపిస్తుంది. అందులోనూ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక్కో బరి ఏర్పాటు చేసిన వారికి పెద్ద బరులయితే మూడు రోజులకు కనీసం రూ. 20లక్షల పైబడి ఆదాయం వస్తుందని అంచనా.
భీమవరం వంటి పట్టణాల్లో పెద్ద మొత్తంలో జరిగే పందాల మూలంగా ఆంధ్రా లాస్ వెగాస్ అనిపించుకునే దశకి చేరింది. ఏటా సంక్రాంతి సమయంలో 200 వరకూ పెద్ద బరులు, మరో 500 వరకూ ఓ మాదిరి బరులు ఏర్పాటు చేస్తుంటారు. పెద్ద బరుల ద్వారానే నిర్వాహకులకు రూ. 40 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని ఓ అంచనా. బరుల నిర్వాహకుల నుంచి పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు కూడా మామూళ్లు అందించాల్సి ఉంటుందని బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన కిలారి తమ్మారావు అన్నారు.
(Kishan Reddy:కేటీఆర్ కు సవాల్ విసిరిన కిషన్ రెడ్డి)
బరి ఏర్పాటు చేయాలంటే చాలా తతంగం ఉంటుంది. ముందుగా అధికార పార్టీ నాయకుల నుంచి అనుమతి ఉండాలి. ఆ తర్వాత పోలీస్ అధికారుల నుంచి కూడా అధికారికంగా మన జోలికి రారనే ధీమా ఉండాలి. లేదంటే ఏర్పాట్లు చేసిన తర్వాత అందరికీ సమాచారం ఇచ్చి, తీరా బరి నడపకపోతే నమ్మకం పోతుంది. మళ్లీ మరుసటి ఏడాది కూడా రారు. అందుకే 15రోజుల ముందుగానే క్లారిటీ తీసుకుంటాం. పైకి ఎన్ని చెప్పినా పండగ మూడు రోజులూ తప్పదు కాబట్టి పర్మిషన్ వచ్చేస్తుంది. మా జోలికి ఎవరూ రాకుండా స్టేషన్ వారిని, లోకల్ లీడర్లను సంతృప్తి పరచాల్సి ఉంటుంది.
కోడిపందాల ద్వారా లభించే ఆదాయం మాత్రమే కాకుండా పల్లెల్లో పందాలకు అనుమతించడం అనేది రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి సంబంధించిన వారే ఎక్కువగా కోడిపందాల బరులు ఏర్పాటు చేస్తుంటారు. పాలక పార్టీకి చెందిన వారి బరులకు ఆటంకాలు కూడా ఉండవు. గ్రామాల్లో కొందరు రాజకీయ నేతలు కూడా బరులు విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ఏటా జరిగే వ్యవహారమే. కనీసం భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు పోలీసులు చూసీ చూడనట్టుగా ఉండాలనే మౌఖిక ఆదేశాలు వస్తుంటాయి. కొన్ని సార్లు పోలీస్ సిబ్బంది కొందరు క్షేత్రస్థాయిలో నిబంధనల పేరుతో కోడి పందాలను అడ్డుకోవడం రాజకీయ వివాదాలకు కూడా దారితీస్తుంది.