- జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్
బీఆర్‌ఎస్ (BRS) ఆవిర్భావ సభపై జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ (JDU leader, Bihar CM Nitish Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నీ కలిసి ముందుకు సాగితే చూడాలని ఉందని చెప్పారు. తనకున్న ఒకే ఒక్క కోరిక అదేనన్నారు. గురువారం పట్నాలో (Patna) ఆయన విలేకరులతో మాట్లాడారు. విపక్షాలన్నీ ఏకతాటిపై నడిస్తే చూడాలని ఉందని, అంతకుమించి తనకు ఇంకేమీ అవసరం లేదని, అదే తన ఏకైక స్వప్నమని చెప్పారు. ఈ విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానన్నారు. విపక్షనేతలంతా కలిసి ముందుకు సాగితే దేశానికే ప్రయోజనకరమని తెలిపారు. కేసీఆర్(KCR) ఆహ్వానం మేరకు ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, మాన్, విజయన్‌తో పాటు ఎస్పీ అధినేత అఖిలేశ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా (Delhi, Punjab and Kerala CMs Kejriwal, Mann and Vijayan along with SP chief Akhilesh and CPI national secretary D. Raja) హాజరై.. మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాల ఐక్యతపై నితీశ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఆర్‌ఎస్ సభకు ఎందుకు హాజరు కాలేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘కేసీఆర్ ఆ సభ నిర్వహిస్తున్న సంగతి నాకు తెలియదు. నేను ఇతర పనుల్లో బిజీగా ఉన్నాను. కేసీఆర్ పార్టీ సభకు ఆహ్వానం అందుకున్న వారంతా అక్కడికి వెళ్లారు’’ అని నితీశ్ జవాబిచ్చారు.
ఆయన వ్యంగ్యంగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, బీఆర్‌ఎస్ సభకు మెజారిటీ ప్రతిపక్ష నేతలు హాజరవకపోవడం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ సభలో ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, మాన్, విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, సీపీఐ నేత డి.రాజా మాత్రమే పాల్గొన్నారు. ఈ సభను చూస్తే.. ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలు 2019లో మాదిరిగా విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ సభకు కొద్ది మంది నేతలే హాజరవడంతో విపక్షాల మధ్య అనైక్యత ఉన్నదన్న సంకేతాలు వెళుతున్నాయని పేర్కొంటున్నారు. కేసీఆర్ గతంలో స్వయంగా కలిసిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్, పశ్చిమబెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీఎస్ నేత కుమారస్వామి, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ (Bihar CM Nitish Kumar, West Bengal CM Mamata, Tamil Nadu CM Stalin, Odisha CM Naveen Patnaik, NCP chief Sharad Pawar, JDS leader Kumaraswamy, Rashtriya Janata Dal leader Tejaswi Yadav.) తదితరులెవరూ బీఆర్‌ఎస్ తొలి సభకు వెళ్లకపోవడం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల ఐక్యత అవసరమని చెబుతున్న నితీశ్, తేజస్వి వెళ్లకపోవడంపై ఢిల్లీ మీడియా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
తమను ఖమ్మం సభకు ఆహ్వానించలేదని జేడీయూ, ఆర్జేడీ (JDU, RJD) వర్గాలు తెలిపాయి. తమకు ఆహ్వానం పంపకపోవడంపై జేడీయూ ప్రధాన కార్యదర్శి త్యాగి అసంతృప్తి వ్యక్తం చేశారు. సగం ఐక్యతతో బీజేపీని ఓడించలేమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, టీడీపీ, జేడీఎస్ (Congress, Trinamool Congress, BJD, TDP, JDS)లాంటి పార్టీలతో పాటు బీజేపీయేతర పార్టీలన్నీ కలిసికట్టుగా ముందుకు రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని.. ఈ క్రమంలో బీజేపీయేతర పార్టీల మధ్య రాజకీయాల్లో అస్పృశ్యత సరికాదని త్యాగి అన్నారు. ఈ దశలో అసంతృప్తి చెందనవసరం లేదని, సమాధాన యాత్ర, బడ్జెట్ సమావేశాల తర్వాత నితీశ్ ఢిల్లీ వెళ్లి ప్రతి పార్టీ నేతతో మాట్లాడతారని తెలిపారు.