‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసు(Money laundering case)లో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేర్లను తొలిసారి చేర్చింది. వీరిద్దరితో పాటు కాంగ్రెస్ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా(Sam petroda), సుమన్ దూబే సహా కేసుతో సంబంధమున్న సంస్థలు, మరికొందరి పేర్లను జతచేసింది. అంతేకాదు యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25న జరపాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసుతో ముడిపడి ఉన్న రూ. 661 కోట్ల స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8), నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను మొదలుపెట్టినట్టు ఈడీ పేర్కొంది. హరియాణాలో షికోపూర్ భూ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ప్రియాంకా గాంధీ(Priyanka gandhi) భర్త రాబర్ట్ వాద్రా(Robert Vadra)ను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపింది.