ప్రజావాగ్గేయకారుడు గద్దర్(Legendary Singer Gaddar) పేరిట తెలుగు సినిమ రంగం(Telugu film Industry)లో పురస్కారాలు అందజేయాలనే తెలంగాణ ప్రభుత్వ(Telanangana Govt) ఆలోచనకు వడి వడిగా అడుగులు పడుతున్నాయి. అవార్డుల జ్యూరీ కమిటీ చైర్‌పర్సన్‌గా నటి జయసుధ ఎంపికయ్యారు. జ్యూరీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. హైదరాబాద్‌లోని చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) కార్యాలయంలో బుధవారం చైర్‌పర్సన్ జయసుధ అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు విచ్చేశారు. జ్యూరీ కమిటీకి తన విలువైన సలహాలు, సూచనలిచ్చారు. 14 ఏండ్ల తర్వాత తిరిగి పురస్కారాల ప్రదానం జరుగబోతున్నదని వెల్లడించారు. అవార్డ్స్ నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సభ్యులను కోరారు. తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా వ్యవహరించాలని సూచించారు. అనంతరం జయసుధ మాట్లాడుతూ.. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్‌గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ హరీశ్ మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ అన్ని కేటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందాయని చెప్పారు. వ్యక్తిగత కేటగిరిలో 1172, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర క్యాటగిరీల్లో 76 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని జ్యురీ తెలిపింది.