`హెల్మెట్ ధరించు బాబూ ! లేదంటే యమపురికే.. ట్రిపుల్ రైడింగ్ ప్రాణానికి రిస్క్ బాలకా !`యమ ధర్మరాజు వాహనదారుల(Bikers)ను హెచ్చరించాడు. ట్రాఫిక్ నిబంధనలు(Traffic rules) పాటించని ఉల్లం`ఘనుల`ను ఆపి వారికి కౌన్సింగ్ ఇచ్చాడు. హైదరాబాద్‌లో(Hyderabad)ని బేగంపేటలో ఇలా శనివారం వినూత్న రీతిలో ప్రత్యేక డ్రైవ్(Special Drive) జరిగింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్, డీసీపీ ట్రాఫిక్-1 రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, నిప్పాన్ ఎక్స్ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు భాగస్వాములయ్యారు.
నిప్పాన్ ఎక్స్ప్రెస్ సిబ్బంది యమధర్మరాజు, చిత్రగుప్త వేషధారణలో దారిలో కాపుగాశారు. ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని సూచించారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలన్నారు. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణహాని ఉండదని హితవు పలికారు. డ్రైవ్‌లో పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్సై భూమేశ్వర్, నిప్పాన్ ఎక్స్ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆఫిషియల్స్ సుధీర్ నాయర్, కలిమి అలీ, ప్రియాంక , సిబ్బంది సుధాకర్ , అనిల్, ఉదయ్ భాస్కర్, టీటీఐ బేగంపేట సిబ్బంది అయాన్ , రాజేష్ కృష్ణ పాల్గొన్నారు.