తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పటి పేరు భారత రాష్ట్ర సమితి)(Bharata Rastra Samithi)కి ఈ నెల 27కు అక్షరాలా పాతికేళ్లు(Silver jubilee function) నిండబోతున్నాయి. గులాబీ శ్రేణులు రజతోత్సవ వేడుక నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. వరంగల్‌కు కూతవేటు దూరంలోని ఎల్కతుర్తి(Elkaturthi)లో వేడుకకు అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Ex Cm kcr) మినహా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కాలికి బలపం కట్టుకుని ఊరూరా పర్యటిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలను స్వయంగా కలిసి రజతోత్సవ సభకు భారీగా జనసమీకరణ చేయాలని పిలుపునిస్తున్నారు.
కేసీఆర్ రజతోత్సవ సభలో ఏం మాట్లాడతారనే చర్చ ఒక్క రాజకీయ వర్గాల్లోనే కాదు యావత్ తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
కలిసి వచ్చిన కంచ భూముల వివాదం
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతున్న వ్యతిరేక పవనాలు. కంచ గచ్చిబౌలి భూముల వివాదం చిలికి చిలికి గాలివానై.. కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీసే వరకు వెళ్లింది. ఈ విషయంలో సాక్షాత్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సర్కార్‌కు అక్షింతలు వేసింది. సరాసరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు పేర్కొనకుండా, సీఎం గౌరవానికి భంగం వాటిల్లుతుందని భావించి.. సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ కార్యదర్శులకు చురకలు అంటించింది. అవసరమైతే `కంచ` భూముల్లోనే జైలు కట్టించి అందులో పడేస్తామని హెచ్చరించింది. అప్పటికప్పుడు భూములు చదును చేయించే పనులన్నింటినీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత సైతం భూముల అమ్మకంపై గళమెత్తారు. ఇవన్నీ బీఆర్ఎస్ కు కలిసి వచ్చాయి. మరోవైపు హైడ్రా కూల్చివేతలతో సర్కార్ ప్రతిష్ఠ మసక బారింది. వీధిన పడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు సర్కార్‌పై అసంతృప్తితో ఉన్నారు. డీపీఆర్ సిద్ధం చేయకుండానే హైదరాబాద్ చుట్టు పక్కల మూసీ పరీవాహకంలో నివస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించడం కూడా ప్రభుత్వానికి బూమరాంగ్ అయింది. ఇవన్నీ బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్స్‌గా మారాయి.
అధినేత నోరు విప్పుతారా?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత బీఆర్ ఎస్ అధినేత అసెంబ్లీ ముఖం చూడడం మానేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారోత్సవానికి, మరోసారి బడ్జెట్ సమావేశాలప్పుడు ఆయన చట్టసభకు వచ్చారు. అదంతా తూతూమంత్రపు వ్యవహారమని, కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై గళమెత్తాలని సీఎం రేవంత్ సహా అధికార పార్టీ సభ్యులు సవాల్ విసిరారు. అయినప్పటికీ కేసీఆర్ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోనట్లే కనిపించింది. ఆ కౌంటర్లకు కేసీఆర్ రిప్లై కూడా ఇవ్వలేదు. కేటీఆర్, కవిత సైతం దీనిపై నోరు విప్పలేదు.
ప్రజాప్రతినిధిగా ఎన్నికల్లో గెలిచి చట్టసభలకు రాకపోవడంపై పౌర సమాజంలోనూ కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితులపై కూడా బయట వేరేలా ప్రచారం జరుగుతున్నది. ఆయన అనారోగ్యంతో బాధతున్నారనే ప్రచారం ఊపందుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పార్టీ అధినేత సభ వేదికగా కాంగ్రెస్‌కు ఎలాంటి బాణాలు ఎక్కుపెడతారో? గులాబీ శ్రేణులకు ఎం పిలుపునిస్తారో తేలాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే!