ముంబై: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా శశిధర్ జగదీషన్(55) నియమితులయ్యారు. జగదీషన్ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. అక్టోబర్ 27 నుంచి మూడేళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారు. 1996లో బ్యాంకులో చేరిన జగదీషన్ ఫినాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, తదితర విభాగాలకు అధిపతిగా పనిచేశారు.
ప్రస్తుత ఎండీ ఆదిత్య పూరి స్థానంలో శశిధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 26తో ఆదిత్య పదవీకాలం ముగుస్తుంది. నూతన సీఈవో, ఎండీగా శశిధర్ నియామకాన్ని ఆమోదించడానికి బ్యాంకు బోర్డు డైరెక్టర్ల సమావేశం నిర్ణీత సమయంలో సమావేశమవుతుందని, ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమాచారమిచ్చింది. ఆర్‌బీఐ ఆమోదం కోసం షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అభ్యర్థులలో జగదీషన్ ఒకరు. తదుపరి సీఈవో ఎంపిక కోసం బ్యాంకు బోర్డు సెలక‌్షన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.