- దంచికొట్టిన ఏబీడీ.. రాణించిన కోహ్లి
విజయం నీదా నాదా అన్నట్లు జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాజస్తాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసింది. 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఛేదించింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లో పడిక్కల్(35 పరుగులు) ఆకట్టుకోగా, మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్(14)మరోసారి నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(43 పరుగులు, 1ఫోర్, 2 సిక్సర్లు) ఆచితూచి ఆడుతూ.. స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కార్తిక్ త్యాగి వేసిన బాల్ ను సిక్సర్ గా మలిచేందుకు ప్రయత్నించగా.. రాహుల్ తెవాటియా అద్భుత క్యాచ్‌తో విరాట్‌ను వెనక్కి పంపాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన మిస్టర్ 360(ఏబీడీ) మ్యాచ్‌ను చేజారనీయలేదు. గురుకీరత్ సింగ్(19) సాయంతో, కేవలం 22 బంతుల్లో 6 సిక్సర్లు, 1ఫోర్ సాయంతో ఆకాశమే హద్దుగా చెలరేగి 55 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాజస్తాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్, త్యాగి, రాహుల్ తెవాటియా తలో వికెట్ పడగొట్టారు.