ఇస్లామాబాద్ :పాకిస్తాన్ మరోసారి తన దుర్నీతిని ప్రదర్శించింది. జమ్ము, కశ్మీర్, లడఖ్ ప్రాంతాలనూ తమ భూభాగాలుగా పేర్కొంటూ నూతన రాజకీయ మ్యాప్‌కు పాక్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసి బుధవారంతో ఏడాది అవుతున్న క్రమంలో పాకిస్తాన్ ఈ మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం. కొత్త మ్యాప్‌ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆవిష్కరిస్తూ ఇది పాకిస్తాన్, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని, పాక్ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమని అభివర్ణించారు.
కాగా, ఇప్పటివరకూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అన్ని ప్రాంతాలను అధికారికంగా తమ భూభాగంగా పాకిస్తాన్ పేర్కొనడం లేదు. గిల్గిట్-బాల్టిస్తాన్‌ను తమ భూభాగంగా పాక్ పేర్కొంటుండగా, మిగిలిన ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్‌గా పాక్ వ్యవహరిస్తోంది. నేపాల్ సైతం భారత భూభాగాన్ని తమదిగా పేర్కొంటూ ఇటీవల కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం కలకలం రేగింది.అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాటు నేపాల్ పాలక పార్టీలోనే తిరుగుబాటు రావడంతో భారత వ్యతిరేక చర్యలపై నేపాల్ వెనక్కుతగ్గింది.