టాంజానియా: రెండు అరుదైన రాళ్లతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయిన టాంజానియా వ్యక్తి సనెన్యూ లైజర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గనులు తవ్వే పని చేసుకుంటూ పొట్ట పోషించుకునే అతనికి ఓ రోజు రెండు పెద్ద రత్నాలు దొరికడంతో కోటీశ్వరుడిగా మారిపోయాడు. తాజాగా ఆయనకు మరోసారి రత్నం దొరికింది. మన్యారాలోని టాంజానియా గనుల్లో లభ్యమైన ఈ రత్నం 6.3 కిలోల బరువు తూగింది. దీని విలువ 4.7 బిలియన్ టాంజానియా షిల్లాంగ్స్(రెండు మిలియన్ డాలర్లు)గా ఉంది.
లైజర్‌కు తొలిసారిగా జూన్‌లో ఈ అరుదైన రత్నాలు రెండు దొరకగా వాటిని ప్రభుత్వానికి విక్రయించాడు. దీంతో సుమారు 25 కోట్ల వరకు సంపాదించి ఒక్కరోజులో ధనవంతుడయ్యాడు. వీటినే ఆ దేశంలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద టాంజానిట్ రత్నాలని స్వయంగా ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే డబ్బులు సంపాదించిన తర్వాత తన జీవితంలో ఎలాంటి ఆర్భాటాలకు పోలేదని లైజర్ వెల్లడించాడు. ఎప్పటిలాగే తన 2 వేల ఆవులను పెంచుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ డబ్బుతో ఓ పాఠశాలను కట్టిస్తానంటున్నాడు. ఇతనికి నలుగురు భార్యలు, ముప్పై మంది పిల్లలు ఉన్నారు. కాగా ఈ భూమి మీదే అరుదైనవిగా టాంజానైట్ రత్నాలు గుర్తింపు పొందాయి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పర్పుల్ రంగుల్లో లభ్యమవుతాయి. అయితే రానున్న 20 ఏళ్లలో ఇవి అంతరించిపోనున్నాయని అక్కడి స్థానిక భూగోళవేత్త అంచనా వేస్తున్నారు.