end
=
Saturday, November 23, 2024
క్రీడలుకేకేఆర్‌కు ఇక కష్టమే..
- Advertisment -

కేకేఆర్‌కు ఇక కష్టమే..

- Advertisment -
- Advertisment -

-కీలక మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు చెన్నై జట్టు షాక్‌ ఇచ్చింది. ఐపీఎల్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో కేకేఆర్‌ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌.. రుతురాజ్‌ గైక్వాడ్‌(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72) అర్ధ శతకంతోపాటు జడేజా (11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెన్నై వరుసగా రెండో మ్యాచ్‌ నెగ్గింది. తొలుత టాస్‌ ఓడి, బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 172/5 స్కోరు చేసింది. ఓపెనర్‌ నితీష్‌ రాణా (61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 87) హాఫ్‌ సెంచరీ చేశాడు. ఎన్‌గిడి (2/34) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో చెన్నై ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 178 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంబటి రాయుడు (38) రాణించాడు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి (2/20), కమిన్స్‌ (2/31) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. గైక్వాడ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

లక్ష్యం కోసం బ్యాంటింగ్‌కు దిగిన చెన్నై ఛేదనను నెమ్మదిగా ఆరంభించింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (14), రుతురాజ్‌ గైక్వాడ్‌ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. దీంతో పవర్‌ప్లేలో చెన్నై 44 పరుగులు మాత్రమే చేసింది. అయితే, వాట్సన్‌ను అవుట్‌ చేసిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి.. కోల్‌కతాకు బ్రేక్‌ ఇచ్చాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో వాట్సన్‌.. రింకూకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. గైక్వాడ్‌కు అంబటి రాయుడు జత కలవడంతో స్కోరు బోర్డు జోరందుకొంది. రాణా వేసిన 10వ ఓవర్‌లో రాయుడు హ్యాట్రిక్‌ ఫోర్లతో 16 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో గైక్వాడ్‌ 4,6తో దూకుడు పెంచాడు. నాగర్‌కోటి వేసిన 12వ ఓవర్‌లో డబుల్‌తో గైక్వాడ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. రాయుడు సిక్స్‌ బాదడంతో టీమ్‌ స్కోరు సెంచరీ మార్క్‌ చేరింది. కమిన్స్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన రాయుడు.. అదే ఓవర్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. గైక్వాడ్‌తో కలసి రాయుడు రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనీ (1)ని వరుణ్‌ బౌల్డ్‌ చేశాడు. చివరి 18 బంతుల్లో 34 పరుగులు కావాల్సిన సమయంలో.. గైక్వాడ్‌ను కమిన్స్‌ బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. అయితే, శ్యామ్‌ కర్రన్‌ (13 నాటౌట్‌), జడేజా క్రీజులో ఉండడంతో చెన్నై మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకోలేదు. ఫెర్గూసన్‌ 19వ ఓవర్‌లో జడేజా 4,6,4తో 20 పరుగులు సాధించడంతో.. ఆఖరి ఓవర్‌లో గెలుపుకు 10 పరుగులుగా సమీకరణ మారింది. నాగర్‌కోటి వేసిన చివరి ఓవర్‌లో కొంత ఉత్కంఠ రేగినా.. జడేజా వరుస సిక్స్‌లతో మ్యాచ్‌ను ముగించాడు.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌కు ఆరంభం ఫర్వాలేదనిపించినా.. మధ్య ఓవర్లలో చెన్నై బౌలర్లు పట్టు బిగించడంతో కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమవుతుందా? అనిపించింది. కానీ ఓపెనర్‌ రాణా, దినేష్‌ కార్తీక్‌ (10 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్‌) బ్యాట్‌లు ఝళిపించడంతో చివరి 5 ఓవర్లలో 66 పరుగులతో పోరాడగలిగే స్కోరు చేసింది. ఓపెనర్లు గిల్‌(26), నితీష్‌ రాణా మంచి ఆరంభాన్నే అందించారు. శాంట్నర్‌ వేసిన 6వ ఓవర్‌లో రాణా 4,4,6తో గేర్‌ మార్చడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి నైట్‌ రైడర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 48 రన్స్‌ చేసింది. 8వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన కర్ణ్‌ శర్మ (1/35).. గిల్‌ను అవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన నరైన్‌ (7)ను శాంట్నర్‌ (1/30) ఊరించే బంతితో క్యాచ్‌ అవుట్‌ చేశాడు.

10 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 70/2 స్కోరు మాత్రమే చేసింది. రింకూ సింగ్‌ (11)ను జడేజా (1/20) అవుట్‌ చేశాడు. ఈ దశలో కెప్టెన్‌ మోర్గాన్‌ (15) క్రీజులోకి రావడంతో రాణా.. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 13వ ఓవర్‌ రెండో బంతికి సింగిల్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న రాణా.. కర్ణ్‌ 16వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో మోత మోగించాడు. రాణా, మోర్గాన్‌ను ఎన్‌గిడి పెవిలియన్‌ చేర్చగా..లోయరార్డర్‌లో కార్తీక్‌ స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -