ఐపీఎల్ తుది ఘట్టానికి చేరుకుంది. ఇవాళ జరిగే మ్యాచ్‌తో రెండో ఫైనలిస్ట్ తేలిపోనుంది. మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. వార్నర్ కెప్టెన్సీ వహిస్తున్న సన్‌రైజర్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ సమతూకంగా ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగుళూరు జట్టును ఓడించి, మంచి ఊపుమీదుంది ఆ జట్టు. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లోనూ వార్నర్ టీం విజయ దుందుభి మోగించింది. మంచి నెట్ రన్‌రేట్‌తో ఐపీఎల్ రెండో అంచెకు చేరుకుంది. ఆల్‌రౌండర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. వార్నర్, పాండే బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ.. ఆరెంజ్ క్యాప్ పోటీలో ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కాస్త నిరాశాజనకంగా కనిపిస్తోంది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు చాలా ఓటములు చవిచూసింది. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లోనూ ముంబైతో మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసి, ఓటమి మూటగట్టుకుంది. ధావన్, అయ్యర్‌పై ఆ జట్టు అతిగా ఆధారపడుతోంది. పంత్ ప్రతి మ్యాచ్‌లోనూ తేలిపోతున్నాడు. ఆల్‌రౌండర్ స్టోయినిస్.. ఢిల్లీకి పెద్ద బలం అని చెప్పవచ్చు. పృథ్వీ షా నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది డీసీ. చూడాలి మరి ఏ జట్టు ముంబైతో టైటిల్ పోరుకు సిద్దమవుతుందో.