- భాగ్యనగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్
- ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ మంగళవారం లాంఛనంగా ప్రారంభమయింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే. జవహర్‌నగర్‌లోని ఈ ప్లాంట్ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు ప్రారంభోత్సవం చేశారు. ప్లాంట్‌లోని రెండు బాయిలర్లకు గాను ప్రస్తుతం ఒకదాని ద్వారా రోజుకు 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఎంఎస్‌డబ్లు్యఎం) ప్రాజెక్ట్‌గా వ్యవహరిస్తున్న దీని ద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌టన్నుల ఆర్డీఎఫ్ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మలిదశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి.
రెండు దశలు పూర్తయితే జవహర్‌నగర్‌కు తరలిస్తున్న చెత్తనుంచి 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్‌లో పర్యావరణహిత థర్మల్ కంబషన్ టెక్నాలజీతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటివి ఢిల్లీ, జబల్‌పూర్‌లలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్లాంట్ వల్ల చెత్త నుంచి విద్యుత్‌తో చెత్త సమస్యకు పరిష్కారంతోపాటు పరిసరాల్లోని ప్రజలకు కాలుష్యం తగ్గుతుంది. చెత్త నుంచి ఆదాయం లభిస్తుంది. ఇప్పటి వరకు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. రోజుకు సగటున 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది. కాగా, ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.