బిహార్‌లో లెఫ్ట్ పార్టీలు మళ్లీ బలం పుంజుకున్నాయి. గత అసెంబ్లీలో లెఫ్ట్ పార్టీలకు కేవలం 3 సీట్లలో ప్రాతినిథ్యం ఉండగా, ప్రస్తుతం 16 స్థానాల్లో గెలుపొందాయి. 2010 ఎన్నికల్లో సీపీఐ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే గెలుపొందగా, మిగిలిన లెఫ్ట్ పార్టీలకు అసెంబ్లీలో అసలు ప్రాతినిథ్యమే లేదు. గత(2015) ఎన్నికల్లో సీపీఐ-ఎంఎల్(లిబరేషన్) మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా, సీపీఐ, సీపీఎం ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయాయి. ఇప్పుడు మాత్రం ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కూటమిలో ఈ మూడు పార్టీలు చేరి ఏకంగా 29 స్థానాల్లో పోటీచేసి 16 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేశాయి. ఇది లెఫ్ట్ పార్టీలకు శుభ పరిణామమని చెప్పవచ్చు. చాలా ఏళ్ల తర్వాత ఎర్రజెండా రెపరెపలాడింది.