బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఫలితాలపై మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎన్నికల సంఘం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసిందని ఆరోపించారు. అయితే ఇది మొదటిసారేం కాదని, 2015 కూడా ఇలాగే జరిగిందని తేజస్వి అన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం తేజస్వీ యాదవ్ మొదటిసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారు. ప్రజలు భారీ మెజారిటీతో మహాకూటమికి పట్టం కట్టారు. కానీ అధికారం కోసం బీజేపీ దొడ్డిదారులు వెతుక్కుందని ఎద్దేవా చేశారు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరించింది అని తేజస్వీ యాదవ్ అన్నారు.
ఈ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి 119 స్థానాలు గెలిచిందని, అయితే అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి 110 స్థానాలే గెలిచినట్లు ఈసీ ప్రకటించిందని ఆర్జేడీ ఆరోపించింది. చాలా మంది అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలుపొందడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తమ అభ్యర్థులే గెలిచారనడానికి ఆర్జేడీ కొన్ని రుజువులు చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఫలితాలు విడుదల చేసిన రాత్రి ఈసీ మీడియా సమావేశం నిర్వహించి ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు విధానంలో ఎలాంటి లోపాలు లేవని, ఈ విషయమై మాటిమాటికీ తాము వివరణ ఇవ్వలేమని ఈసీ పేర్కొంది.