గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్‌ఎంసీ) పోరుకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఇవాళ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ.. బుధవారం నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. నవంబర్ 18, 19, 20 తేదీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందనీ.. నామినేషన్ విత్‌డ్రాకు 22వ తేదీన అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా, డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందనీ, 4న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ తెలిపారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆయా పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని కార్పోరేషన్లలో ఎమ్మెల్యేలను సిద్దం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వందకు పైగా స్థానాలను సాధించడమే ఆ పార్టీ లక్ష్యంగా పనిచేస్తోంది. అందుకు బీజేపీ కూడా దూకుడు గానే వ్యవహరిస్తోంది. ఎంపీ ఎలక్షన్‌లో బీజేపీ ఊహించిన దాని కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకొని టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నయమని చెప్పకనే చెబుతోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయం సాధించడం వారికి సానుకూలాంశం. కాంగ్రెస్ కూడా తమ ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది.