end
=
Tuesday, November 26, 2024
వార్తలురాష్ట్రీయంబీజేపీ ఓ దగాకోర్‌ పార్టీ: సీఎం
- Advertisment -

బీజేపీ ఓ దగాకోర్‌ పార్టీ: సీఎం

- Advertisment -
- Advertisment -

కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బద్మాష్‌ బీజేపీ ఓ దగాకోర్‌ పార్టీ అని సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ వల్ల ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడం, అబద్ధాల ప్రచారంతో ఆ పార్టీ పబ్బం గడుపుకొంటోంది’ అని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం, జీహెచ్‌ఎంసీ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ల సంయుక్త భేటీ జరిగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో.. పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు, పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, గ్రేటర్‌ డివిజన్‌ ఇన్‌చార్జ్‌లకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. అలాగే, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని కేసీఆర్‌ ఈ భేటీలో ఆరోపించారు. ‘‘బదులుగా పాకిస్తాన్‌, చైనా ప్రతి చర్యలకు దిగితే, దానిని బూచిగా చూపిస్తున్నారు. ఆయా దేశాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకుంటున్నారు. దీని వల్ల దేశాన్ని ఐక్యంగా ఉంచగలుగుతున్నారే తప్ప, ప్రధాని మోదీ, బీజేపీ వద్ద ప్రజలను ఐక్యం చేసే అజెండా లేదు’’ అని దుయ్యబట్టారు. బీజేపీ జాతీయవాదం పేరుతో మతతత్వ ధోరణితో ముందుకు సాగుతోందని, ఆ పార్టీకి అభివృద్ధి ప్రణాళిక అంటూ ఏమీ లేదని విమర్శించారు.

ఏమైనా అంటే చాలు, మతం మతం అంటారు. వాళ్లు చెబితేనే.. ఈ సంస్కృతి, సంప్రదాయాలు, మతాచారాలు వచ్చాయా? హిందువుల నరనరాన హిందూత్వం, దైవ చింతన, భక్తి ఎప్పటి నుంచో ఉన్నాయి. బీజేపీ పుట్టి ఎన్ని రోజులు అవుతోంది? వీళ్లు చెప్పకముందు గుళ్లు, గోపురాలు లేవా? నా కంటే ఎక్కువ హిందూత్వవాది, యజ్ఞయాగాలు చేసిన వాళ్లు ఉన్నారా? నా అంత చిత్తశుద్ధితో దేవుణ్ని నమ్మేవాళ్లున్నారా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. మతం పేరుతో బీజేపీ నేతలు సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారని కేసీఆర్‌ ఆరోపించారు.

దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలందరూ కలిపి 30 కోట్ల మంది దాకా ఉన్నారు. వాళ్లందరినీ వెళ్లగొడతారా? ఇవేమి ఆలోచనలు?’’ అంటూ బీజేపీ అధినాయకత్వాన్ని నిలదీశారు. దేశానికి, సమాజానికి భవిష్యత్తు వారసులైన యువత మెదళ్లలో బీజేపీ నేతలు సోషల్‌ మీడియా ద్వారా విష బీజాలు నాటుతున్నారని కేసీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దీనిని పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీని, ఆ పార్టీ నేతల తప్పుడు ప్రచారాలను నిలువరించే శక్తి టీఆర్‌ఎస్‌కే ఉందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించాలని పార్టీ నేతలను కోరారు.

ఎన్నికల ప్రచారం అనే కాకుండా, ఇతర సందర్భాల్లోనూ ప్రత్యర్థులకు తాము సవాళ్లు విసరాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘మనం చేసిన అభివృద్ధే బొచ్చెడు ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసింది, చేయబోయేది ఏమీ లేదు. వాళ్లు చెప్పరు కూడా’’ అని ఎత్తిపొడిచారు. ‘‘అభివృద్ధే మన ఆయుధం’’ అని స్పష్టంచేశారు. ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 400 రకాల పనులు చేసిందని.. వాటివల్ల ఏయే వర్గాలకు మేలు జరిగిందనే విషయాన్ని సందర్భానికి అనుగుణంగా ప్రచారంలో పెట్టాలని నేతలకు సూచించారు. ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు పొందిన నగరంగా హైదరాబాద్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తున్నదీ.. ఎన్ని సంస్థలు, కంపెనీలు ఇక్కడికి వస్తున్నదీ కూడా చెప్పాలన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు వెళ్తున్నాయి? కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు ఎన్ని? అనే వాస్తవాలను ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు.

మేయర్‌ పీఠంపై ధీమా..
జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠం మరోసారి టీఆర్‌ఎస్‌ దక్కించుకోవటం లాంఛనమేనని కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, 104కు తక్కువ కాకుండా డివిజన్లు గెలవబోతున్నామని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాన్ని సీరియ్‌సగా తీసుకోవాల్సిన పని లేదన్నారు. అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోవడానికి ప్రత్యేక పరిస్థితులు మాత్రమే కారణమని చెప్పారు. అంతేతప్ప ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేనేలేదన్నారు.

కాగా.. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సమావేశం నివాళి అర్పించింది. ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్‌ గుప్తాను.. సమావేశంలో కేసీఆర్‌ పరిచయం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డివిజన్‌ ఇన్‌చార్జిల పేర్లను ప్రకటించారు. అభ్యర్థుల పేర్లను రెండు విడతలుగా బుధ, గురువారాల్లో ప్రకటిస్తామన్నారు. ప్రచార వ్యూహంపైనా దిశానిర్దేశం చేశారు. నగరంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాల జాబితాను తయారు చేసి, వాటిని డివిజన్ల వారీగా ఇన్‌చార్జిలకు అప్పగించారు. డివిజన్ల వారీగా ఓటరు లిస్టులను, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల జాబితాను కూడా అందించారు.

హైదరాబాద్‌లో రూ.67 వేల కోట్లతో అభివృద్థి పనులు జరిగాయని సీఎం తెలిపారు. ‘‘నగరంలో ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడానికి కొత్త ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ పాస్‌ల నిర్మాణం జరిగింది. బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. జీవో నంబర్‌ 58 ద్వారా పేదల ఇంటి స్థలాలను రెగ్యులరైజ్‌ చేశాం. 50 వేల మందికి రోజూ 5 రూపాయలకే భోజనం పెడుతున్నం. ఇంకా అనేక కార్యక్రమాలు జరిగాయి. జరుగుతున్నాయి. వాటన్నింటినీ ప్రజలు చూస్తున్నారు.

మాయ మాటలకు, తప్పుడు ప్రచారానికి పడిపోయే వాళ్లు కాదు. తప్పుడు ప్రచారాలతో అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. వాటిని టీఆర్‌ఎస్‌ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలి’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ మతసామరస్యానికి ఆలవాలమైన ప్రాంతమని.. చేతగాని నేతల వల్ల కొన్నిసార్లు మతకల్లోలాలు వచ్చినా, టీఆర్‌ఎస్‌ హయాంలో నగరం ప్రశాంతంగా నిద్రపోతోందని పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -