ఐటీ ఉద్యోగాల్లో గ్రామీణ మహిళలు మెరవనున్నారు. కరోనా కాలంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత గ్రామీణ మహిళా సాధికారతకు తోడ్పాటుగా ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం కాప్‌జెమినీ కీలక నిర్ణయం తీసుకుంది. ‘సఖి దృష్టికోణ్’ అనే ప్రాజెక్టు ద్వారా అర్హులైన గ్రామీణ మహిళలను తమ కంపెనీలో చేర్చుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. డిసెంబరు నాటికి 500 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇప్పటికే 100 మందిని నియమించుకున్నట్లు, ప్రస్తుతం వారు శిక్షణలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. వీరికి కనీసం రూ.3.5 లక్షల వార్షిక వేతనం లభించనుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడాలనుకునే గ్రామీణ మహిళల్లో వ్యక్తిగత కారణాల వల్ల నగరాలకు రాలేకపోతున్నవారికి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడనుంది. కాప్‌జెమినీ భారత కార్యాలయాల్లో లక్షకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
మెరుగైన టెలికాం మౌలిక వసతులతో ఉద్యోగులు దేశంలో ఎక్కడినుంచైనా నిరంతరాయంగా పనిచేయవచ్చన్న విషయం ఈ కరోనా కాలంలో అవగతమైందని కాప్‌జెమినీ గ్లోబల్ డెలివరీ సెంటర్ హెడ్ ఫర్ సీఐఎస్ ఇండియా రాధికా రమేష్ అన్నారు. అందుకే అర్హులైన గ్రామీణ మహిళలకు ఐటీ ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొన్నా రు. ఈ ప్రాజెక్టు ద్వారా నియమించుకున్న మహిళలు క్లౌడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టు బృందాల్లో సభ్యులుగా పనిచేయనున్నట్లు రాధిక తెలిపారు.