గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో నగరంలో ఎన్నికల ప్రచారం హడావుడి ప్రారంభమైంది. అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరపున రంగంలోకి దిగనున్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. అభ్యర్థుల నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుండటంతో 110 డివిజన్లలో కేటీఆర్రో డ్ షోలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం నుంచి కేటీఆర్ రోడ్‌షోల్లో పాల్గొంటారు. ముందుగా.. కుత్బుల్లాపూర్ నుంచి కేటీఆర్ రోడ్‌షోను ప్రారంభించనున్నారు. కేటీఆర్ రోడ్ షోలన్నీ పూర్తి అయిన తర్వాత ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో గ్రేటర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు.
కాగా, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్‌లో 99 డివిజన్లలో గెలిచి మేయర్ పీఠాన్ని ఏకపక్షంగా దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కూడా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్ పీఠంపై మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ పట్టుమీదుంది. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందే ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మజ్లిస్‌తో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయనుంది. గ్రేటర్ పట్టం మళ్లీ టీఆర్ఎస్‌కే కట్టాలని హైదరాబాద్ ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.