హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎంఐఎం, బీజేపీ నేతలు సై అంటే సై అంటూ మాటలు తూటాలు పేల్చుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ‘సర్జికల్ స్ట్రైక్’ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. వారికి ఎలా మాట్లాడాలో కూడా పాలుపోవట్లేదని అక్బరుద్ధీన్ విమర్శించారు.
అక్రమ కట్టడాలు, పేదల ఇళ్లు కూల్చేస్తామని చెప్తున్నారు కదా. 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదు. హుస్సేన్‌సాగర్‌పై ఉన్న పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేస్తారా మరి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మీకు తగిన గుణపాఠం చెప్పడం మాకు తెలుసన్నారు. అనవసరమైన మాటలు మాట్లాడితే తగిన శాస్తి చేస్తామని అక్బరుద్ధీన్ బీజేపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.