కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ… ఢిల్లీలో కొద్దిరోజులుగా జరుగుతున్న రైతుల ఆందోళనలకు సంఘీభావంగా మంగళవారం నిర్వహించనున్న భారత్‌బంద్‌కు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలో అధికారపక్షమైన టీఆర్‌ఎస్ కూడా భారత్ బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించటం,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పిలుపునివ్వటంతో ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎక్కడా బంద్‌లో పాల్గొనటం లేదు.
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ షాద్‌నగర్ బూర్గుల గేట్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోలో పాల్గొంటున్నారు. కేబినేట్ మంత్రులు, ఎమ్మెల్యేలంతా తమ తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో నిర్వహించే బంద్‌లో పాల్గొంటారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని టేక్రియాల్ గేట్ వద్ద నిర్వహించే ధర్నాలో పాల్గొంటారు. బంద్‌కు మద్దతుగా 2000 మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ(ఎం), తెలంగాణ జన సమితి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ, తెలంగాణ వికాస సమితి, తెలంగాణ రైతాంగ సమితి, యూసీసీఆర్‌ఐ(ఎంఎల్), ఎస్‌యూసీఐ పార్టీ, సీపీఐ(ఎంఎల్) పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఫార్వర్డ్ బ్లాక్, తెలంగాణ ఇంటిపార్టీ సహా ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ భారత్ బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. షాద్‌నగర్ మార్కెట్ కమిటీ వద్ద ధర్నాలో పాల్గొంటున్నారు. కోఠి ఉమెన్స్ కళాశాల నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు నిర్వహించే ర్యాలీలో టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ పాల్గొంటున్నారు.
సంగారెడ్డి చౌరాస్తా వద్ద ముంబై హైవేను దిగ్బంధించనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఉదయం 9 గంటలకు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ జాతీయ రహదారిపై నిర్వహించే రాస్తారోకోలో సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భారత్ బంద్‌కు టీఎన్‌జీవోల సంఘం మద్దతు ప్రకటించింది. సోమవారం బాగ్ లింగంపల్లి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో బంద్‌పై ప్రచారం చేస్తూ వామపక్ష ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. వరంగల్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించే చిత్తశుద్ధి కేసీఆర్‌కు ఉంటే అసెంబ్లీలో తీర్మానం ఎందుకు పెట్టలేదని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
బస్సులు కూడా బంద్: బంద్‌కు రాష్ట్రంలోని అధికార పక్షమే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మధ్నాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ బస్సులు నడపటం లేదు.
టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా మధ్యాహ్నం 12 తర్వాతే బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. దీంతో ఆర్టీసీ అధికారులు సాధ్యమైనంత వరకు బస్సులను బయటకు తీయకుండా ఉండడమే మంచిదన్న ఆలోచనలకు వచ్చారు. ఎలాంటి లిఖితపూర్వక ఉత్వర్వులను జారీ చేయికపోయినా… రీజినల్ మేనేజర్ల నుంచి డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. ఉదయం పూట కొన్ని బస్సులను నడిపినా… 9, 10 గంటల నుంచి బస్సులను పెద్దగా నడపవద్దంటూ చెప్పినట్లు సమాచారం. దీంతో బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. నైట్ హాల్ట్ బస్సులు మాత్రం ఉదయం పూటే డిపోలకు చేరుకుంటాయి.
పరీక్షలు వాయిదా: బంద్ నేపథ్యంలో మంగళవారం జేఎన్‌టీయూ సెమిస్టర్ పరీక్షలు, పోస్టుగ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్టు వాయిదా పడ్డాయి. కాళోజీ హెల్త్ వర్సిటీ కూడా మంగళవారం జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసింది.
సోషల్ మీడియాపై అప్రమత్తం: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను బీజేపీ సమర్థిస్తోంది. బంద్‌ను వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో బంద్, రాజకీయ రంగు పులుముకుని శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీస్‌లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాలకు, ఢిల్లీలో రైతు ధర్నాలకు, నేటి భారత్ బంద్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఇరుపక్షాలు విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టుల మీదా ఐటీ విభాగం అధికారులు దృష్టి సారించారు. గతంలో ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులను ముందుగానే గుర్తించి తొలగించారు. ఈసారీ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టప్రకారం చర్య లు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
బంద్‌లో మంత్రులు.. పోలీసులు అప్రమత్తం
భారత్ బంద్‌కు తెలంగాణ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు, మద్దతుదార్లు బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరిగే బంద్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్సీ కవిత, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో బంద్ ముసుగులో ఎవరూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా వ్యూహాలపై అందరు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో డీజీపీ కార్యాలయ ఉన్నతాధికారులు సమీక్షనిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై పోలీసుల ఆంక్షలు అమల్లో ఉన్నాయి. జిల్లాల్లో ఉన్న బలగాలతోపాటు అందుబాటులో ఉన్న కేంద్ర బలగాల్ని ఉపయోగిస్తున్నారు.