- మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ : కోవిడ్ టీకాపై అనుమానాలు, అపోహలను తొలగించి ప్రజల్లో నమ్మకం పెంచేందుకు తానే తొలి టీకాను తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో ఎలాంటి భయం లేదని, బర్డ్ ఫ్లూతో ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా మేఘా సంస్థ నిమ్స్ ఆస్పత్రిలో రూ.18 కోట్లతో నిర్మించిన ‘ఆంకాలజీ బ్లాక్’ను మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ వందశాతం సురక్షితమైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోజుకు పది లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ ప్రకటించారు.