- అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు, రిటైర్డ్ అధికారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్తతలపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో గాయాల పాలైన పోలీసులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులతో పాటు రిటైర్డ్ అధికారులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఢిల్లీ పోలీస్ మహాసంఘ్ ఆధ్వర్యంలో షహీద్ పార్క్‌లో ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ట్యాక్టర్ ర్యాలీ నేపథ్యంలో సంభవించిన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన పలు ఫొటోలతో కూడిన ప్లకార్డులను చేతబూని వారంతా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా అశోక్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.. తాను ఎర్రకోట వద్ద సెక్యూరిటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నానని, ర్యాలీ సందర్భంగా తన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ‘ఉన్నట్లుండి ఆందోళనకారులు ఎర్రకోటలోకి చొచ్చుకొచ్చారు. వారిని అడ్డుకునే అవకాశం కూడా లేకపోయింది. ఈలోగానే లోపలికి వెళ్లి జెండా ఎగురవేశారు. ఈ క్రమంలోనే వారిని బయటకు తీసుకొచ్చేందుకు నాతో పాటు అక్కడున్న సిబ్బంది ప్రయత్నించారు. అయితే ఉన్నట్లుండి వారంతా మాపై కర్రలు, తల్వార్లతో దాడి చేశారు. ఆ దాడిలోనే నా తలకు తీవ్ర గాయమైంది’ అని ఆయన వాపోయారు.
ఇక మరో హెడ్ కానిస్టేబుల్ సునీత మాట్లాడుతూ.. ఉన్నట్లుండి రైతులు తమపై దాడి చేశారని, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, బారికేడ్లను ధ్వంసం చేసి, వాహనాలను నాశనం చేస్తూ ముందుకు సాగారని ఆవేదన వ్యక్తం చేశారు. వారలా దాడి చేస్తారని తాము ఊహించలేదని, ఉన్నట్లుండి దాడి చేయడంతో తమలో అనేకమంది తీవ్ర గాయాలపాలయ్యామని చెప్పారు. రైతులు ఇలాంటి ఘటలకు పాల్పడటం ఏమాత్రం శోచనీయం కాదు.