- కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు
తెలుగు నటుడు మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు ఛలానా విధించారు. వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా బుధవారం టోలిచౌక్ వద్ద అటుగా వెళ్తున్న నటుడు మంచు మనోజ్ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటాన్ని గమనించిన పోలీసులు అతని కారు ఆపారు. ఆ తర్వాత బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి రూ. 700 జరిమానా విధించారు.
కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడరాదని, అలాగే నంబరు ప్లేట్స్ సరిగా లేని వాహనాలకు గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలకు తప్పా ఎవరూ కూడా బ్లాక్ ఫిల్మ్ వాడరాదనే నిబంధన అమలులో ఉంది. ఈ క్రమంలోనే తెలుగు యాక్టర్లు అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా వేశారు.