యువతను ముందుండి నడిపించే డైనమిక్ లీడర్స్‌ను తయారు చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ముందుకు వచ్చింది. ఈ సంస్థ తాజాగా జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ తో కలిసి తన ఉద్యోగుల కోసం డిజిటల్ పేమెంట్స్ లో మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఈ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ప్రోగ్రామ్ అనేది టెక్నాలజీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ సెక్టార్, ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, మేనేజ్మెంట్ స్టడీస్ వంటి అన్నీ అంశాలన్నీ కవర్ చేస్తూ డిజిటల్ పేమెంట్స్‌లో ఒకే మాస్టర్స్ స్పెషలైజేషన్‌గా ఉంటుంది. అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న వివిధ అవసరాలకు తగినట్లుగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఉద్యోగులు ఈ ప్రోగ్రామ్ ద్వారా వివిధ అంశాలు నేర్చుకుంటూనే డబ్బులు సంపాదించవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెల్సుకుందాం.
ఈ ప్రోగ్రామ్ హైబ్రిడ్ ప్రోగ్రామ్ అయినందున ఉద్యోగులు వీకెండ్ క్లాసెస్‌కు మాత్రమే హాజరవుతారు. ప్రతి సెమిస్టర్‌కు క్యాంపస్‌లో ఒక వారం మాత్రమే గడుపుతారు. తద్వారా వారు NPCIలో యథావిధిగా డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటారు. ఈ ప్రోగ్రామ్ అనేది ఉద్యోగులలో పరిశోధన పద్ధతుల పై చాలా అవగాహన, పరిజ్ఞానం పెంపొందించడంలో బాగా ఉపయోగపడుతుంది.
రీసెర్చ్ పేపర్స్, ఆర్టికల్స్ ప్రచురించడానికి వారిని ప్రోత్సహిస్తుంది. మాస్టర్స్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన NPCI ఉద్యోగులు సూపర్-స్పెషలైజేషన్, పీహెచ్‌డీ వంటి తదుపరి స్టడీస్ కొనసాగించే అవకాశాన్ని కూడా చేజికించుకుంటారు.
ఈ ప్రోగ్రామ్ రేపటి యువ నాయకులను తయారుచేయడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని NPCI తెలిపింది. ఇలా తయారైన లీడర్స్‌కు పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ యూజర్-బేస్‌ను మేనేజ్ చేయగల సామర్థ్యం ఉంటుందని వీరు ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు సాంకేతిక సంస్కరణలను ఎక్కువగా తీసుకువస్తారని NPCI ధీమా వ్యక్తం చేసింది. డిజిటల్ పేమెంట్స్‌లో MMS ప్రోగ్రామ్ NPCI ఉద్యోగులకు ఉత్తమ అవకాశాలను అందిస్తుందని తాము నమ్ముతున్నట్లుగా JBIMS డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసన్ R అయ్యంగార్ పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కవితా లఘటే మాట్లాడుతూ JBIMSలో MMS ప్రోగ్రామ్ ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రోగ్రామ్ కంటెంట్, పద్ధతుల పరంగా ఉత్తమంగా ఉండేలా కూడా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లో హెచ్‌ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ నిషిత్ చతుర్వేది మాట్లాడుతూ, లెర్నింగ్ అవకాశం సృష్టించడం మా ముఖ్యమైన ఉద్యోగుల విలువ ప్రతిపాదనల లో ఒకటి. ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను కో-క్రియేట్ చేయడానికి JBIMS వంటి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌తో భాగస్వామ్యం కావడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాం. మేము ‘లెర్నింగ్ ఫర్ ఆల్’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాం. అభివృద్ధిలో టెక్నాలజీలో శరవేగంగా పరుగులు తీస్తున్న నేటి ప్రపంచంలో తమను తాము అప్‌డేటెడ్‌గా ఉంచుకోవడానికి మా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ప్రతిభావంతులకు మరింత స్ఫూర్తినిస్తుందని, సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.