- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిభారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం ఎక్కువ ఉండడంతో భైంసా పట్టణం జలదిగ్భందంలో చిక్కుకుంది. అదేగాకుండా వరదలు రావడంతో ఆరుగురు గల్లంతయ్యారు. భైంసాలోని నివాస గృహాలు నీట మునిగాయి. పట్ణమంతా ఎటు చూసినా చెరువును తలపించేలా వర్షపు నీరు నిండిపోయింది. ఆటోనగర్, కుబీర్, వినాయక్‌నగర్, రాహుల్‌నగర్ కాలనీలు పూర్తిగా నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలో నుండి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.
అధికారులు అప్రమత్తమై పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్‌ఆర్ గార్డెన్‌లో చిక్కుకున్న ఆరుగురి కోసం నాటు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 20.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గత పదేళ్లలో జూలై మాసంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. అయితే మున్ముందు రోజుల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు చేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.