ఐదారు రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్‌కు అధికంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది.
సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు. గరిష్ఠ నీటి మట్టానికి మరో మీటరు దూరంలో హుస్సేన్ సాగర్‌లో నీరు ఉంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో కూకట్‌పల్లి నాలా నుంచి సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే తూముల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు కూడా వరద పోటెత్తింది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 894 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి.