జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చారు. పవన్ పోటీపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నా ఆయన ఈసారి కూడా భీమవరం బరిలో ఉంటారని చెబుతున్నారు. ఈసారి కచ్చితంగా నియోజకవర్గాలు మార్చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కాకినాడ, తిరుపతి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా పవన్ పోటీ స్థానంపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా భీమవరం నుంచే పోటీ చేస్తారని కొటికలపూడి గోవిందరావు అంటున్నారు. భీమవరం నుంచే రాష్ట్ర రాజకీయాలకు అడుగులు పడనున్నాయని పవన్ తరపున నియోజకవర్గ ప్రజలకు తాము అందుబాటులో ఉంటామని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించబోతోంది అన్నారు.ఈ నెల 17న పవన్ కళ్యాణ్ భీమవరం జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ అర్జీలు స్వయంగా స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు పవన్ కళ్యాణ్‌ను స్వయంగా కలసి వారి సమస్యలను వివరించవచ్చున్నారు. స్థానికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. గోవిందరావు వ్యాఖ్యలతో జనసేన పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. భీమవరం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించకపోయినా.. ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇవ్వడం విశేషం.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకల నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం పవన్ గెలుపు పక్కా అంటోంది జనసేన పార్టీ. అయితే ఈసారి తిరుపతిని తెరపైకి తీసుకొచ్చింది. ఆ పార్టీ నేతలు తిరుపతి ఎమ్మెల్యేగా జనసేనానే ఉండాలని మనసులో కోరిక బయటపెట్టారు. లక్ష ఓట్ల మెజారిటీతో “పవన్”కు గిఫ్ట్ ఇస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు.
అంతేకాదు గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు. ఏకంగా 15వేల 930 వేల మెజార్టీ సాధించారు. ఇప్పుడు పవన్‌ను అంతకు మించి ఎక్కువగానే తిరుపతి ప్రజలు ఆదరిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి పేరు తెరపైకి వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.