end

టాప్‌లో నిలిచిన ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరోమారు దుమ్మురేపింది. సబ్‌స్క్రైబర్ బేస్ పెంచుకుంటూ పోతోంది. అక్టోబరులో జియోను వెనక్కి నెట్టేసి ఏకంగా 3.67 మిలియన్ల మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుంది. ఇది జియో కంటే 1.45 మిలియన్లు అధికం. జియోకు అక్టోబరులో 2.22 మిలియన్ల మంది వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు మాత్రమే వచ్చి చేశారు. యాక్టివ్ యూజర్ల విషయంలోనూ ఎయిర్‌టెల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం దాని నెట్‌వర్క్ పరిధిలో 96.74 శాతం యాక్టివ్ యూజర్లు ఉన్నాయి.

టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్ బేస్ అక్టోబరులో 330.28 మిలియన్లకు చేరుకుంది. సెప్టెంబరులో ఇది 326.66 మిలియన్లుగా ఉంది. అంటే అక్టోబరులో కొత్తగా 3.67 మిలియన్ల మంది కొత్త ఖాతాదారులు ఎయిర్‌టెల్‌కు వచ్చి చేరారు. అయితే రిలయన్స్ జియో మాత్రం 406.35 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్ బేస్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సెప్టెంబరులో ఈ సంఖ్య 404.12 మిలియన్లుగా ఉంది.

ఇక, వీఐ (వొడాఫోన్ ఐడియా) మాత్రం అక్టోబరులో 2.65 మిలియన్ల మంది ఖాతాదారులను కోల్పోయింది. ఫలితంగా సెప్టెంబరులో 295.49 మిలియన్లుగా ఉన్న దాని ఖాతాదారుల సంఖ్య అక్టోబరులో 292.83 మిలియన్లకు పడిపోయింది. అలాగే, ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా అక్టోబరులో 10,215 మంది సబ్‌స్క్రైబర్లనుకోల్పోయింది. ప్రస్తుతం దాని వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల బేస్ 118.88 మిలియన్లుగా ఉంది. ఇక, యాక్టివ్ యూజర్లు బేస్ విషయానికొస్తే 96.74 శాతంతో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 88.78 శాతంతో వీఐ రెండో స్థానంలో ఉండగా, జియో 78.59 శాతంతో మూడో స్థానానికి పరిమితమైంది. బీఎస్ఎన్ఎల్ 61.38 శాతం యాక్టివ్ యూజర్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

Exit mobile version