end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంఅందరి దృష్టి నాగార్జున సాగర్‌పైనే
- Advertisment -

అందరి దృష్టి నాగార్జున సాగర్‌పైనే

- Advertisment -
- Advertisment -

ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, నాయకుల చూపంతా నాగార్జున సాగర్‌పై పడింది. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల హఠాన్మరణానికి గురికావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి ఆరు నెలలలోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నోముల సంతాప దినాలు పూర్తి కాకముందే రాజకీయాలా అంటూనే అన్ని రాజకీయ పక్షాలు తెరవెనుక మంత్రాగాన్ని నడిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికను టీఆర్ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాలు ఆ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా రావడంతో వారు ఈ ఉప ఎన్నికపై ప్రధాన దృష్టి పెట్టారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నియోజకవర్గంపై పట్టున్న నేత కోసం నిఘా వర్గాలను రంగంలోకి దింపిన అధికార పార్టీ, మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలతో పరోక్షంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. చికిత్సకు కేరళ వెళ్లిన జానా తిరిగొస్తేనే కాంగ్రెస్‌, బీజేపీ రాజకీయం ప్రారంభంకానుండగా, ఆశావహులు వారివారి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కేంద్రమైన హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ కళాశాల ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. స్థానికంగా ఉన్న జూనియర్‌ కళాశాలలోనే తాత్కాలికంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మూరుమూల ప్రాంతమైన తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు, కుంకుడుచెట్టు తండాకు ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయి. ఈ రెండు ఎత్తిపోతల నిర్మాణానికి రూ.319.73కోట్లు కేటాయించగా, వీటి ద్వారా 7,600 ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఇదంతా పూర్తిగా గిరిజనులు నివసించే ప్రాంతం. గత ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌ ఈ ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఇక మిర్యాలగూడ నియోజకవర్గానికి మూడు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తూ, రూ.529 కోట్లు కేటాయించారు. ఇవి పూర్తయితే 20వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి.

మిర్యాలగూడకు కేటాయించిన ఎత్తిపోతల పథకాలు దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో నిర్మించనున్నారు. ఇవి పూర్వ చలకుర్తి(సాగర్‌) నియోజకవర్గంలో భాగంగా. భౌగోళికంగా నాగార్జునసాగర్‌కు పక్క మండలాలు. ఇవి గిరిజనులు అత్యధికంగా ఉండే ప్రాంతాలు. పక్క నియోజకవర్గం అయినా, నిధుల ప్రభావం సాగర్‌పై కూడా ఉంటుంది. సీఎం కార్యాలయం నుంచి అభివృద్ధి కార్యక్రమాల ప్రకటన అలా వచ్చిందో లేదో వెనువెంటనే హాలియా, మిర్యాలగూడలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఇక నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.100కోట్లు విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే నర్సింహయ్య మృతి అనంతరం నియోజకవర్గంలో పరిస్థితి, ఏఏ వర్గాల ఆలోచనలు ఎలా ఉన్నాయి, నోముల కుటుంబానికి సానుభూతి ఏ మేరకు ఉంటుంది, అభ్యర్థి ఏ సామాజికవర్గం వారైతే గెలుపునకు అవకాశాలు ఉంటాయనే అంశాలపై ఇంటలిజెన్స్‌ వర్గాలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

పోటీలో జానారెడ్డి ఉంటారా, లేక ఆయన కుమారుడా, వారు బీజేపీలోకి వెళ్లడం ఎంతవరకు వాస్తవం అనే విషయాలపై నిఘావర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి. నర్సింహయ్య కుటుంబం లేదంటే యాదవ సామాజికవర్గం నుంచి అధికార పార్టీలో జిల్లాలో కీలక పదవిలో ఉన్న నాయకుడైతే ఎలా ఉంటుందనే అంశాలను సైతం టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎంసీ.కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు చర్చలో ఉండగా, కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డి బరిలో ఉంటే అందుకు దీటుగా మండలి చైర్మన్‌ గుత్తాను బరిలో దించితే ఎలా ఉంటుందన్న చర్చ అధికార పార్టీ పెద్దల్లో ఉన్నట్టు తెలిసింది.

జానా రాక కోసం కాంగ్రెస్‌ నేతల ఎదురుచూపు
వచ్చే సాధారణ ఎన్నికల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ సజీవంగా ఉండాలంటే నాగార్జునసాగర్‌లో విజయం సాధించి తీరాల్సిందే. తమ అభ్యర్థిగా సీనియర్‌ నేత జానా బరిలో ఉంటే విజయం ఖాయం అనే ధీమాలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేస్తామని జిల్లా నేతలు ఉత్తమ్‌, కోమటిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. నోటిఫికేషన్‌కు ముందు నుంచే ఇక్కడ పర్యటించేందుకు రేవంత్‌, భట్టి విక్రమార్క ఆసక్తిగా ఉన్నారు. ఈనెల 7న జానా కేరళ నుంచి తిరిగొచ్చే అవకాశం ఉంది. ఆయన రాగానే చర్చించి పనిలో దిగుతామని ఎంపీ కోమటిరెడ్డి ఇటీవల నల్లగొండలో ప్రకటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -