సిడ్ని: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.. టీమిండియాతో తొలి వన్డేకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఫించ్ మీడియాతో మాట్లాడుతూ.. బహుశా ఆల్‌టైం గ్రేట్ వన్డే ప్లేయర్ కోహ్లినే కావచ్చని అన్నాడు. 248 వన్డేల్లో 11,867 రన్స్ చేశాడు. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు బాదాడని తెలిపాడు. ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది కోహ్లి స్టామినా ఏంటో. అతను ఆల్‌టైం గ్రేటెస్ట్ ప్లేయర్ అనడానికి అతని రికార్డులే బదులిస్తాయని ఫించ్ అన్నాడు. ఈ వన్డే సిరీస్‌లో కోహ్లిని తొందరగా ఔట్ చేయడంపై తాము దృష్టి సారించినట్లు ఆసీస్ కెప్టెన్ తెలిపాడు.
రోహిత్ లేకున్నా మయాంక్ ఉన్నాడుగా..
వన్డేలు, టీ 20లకు ఓపెనర్ రోహిత్ శర్మ దూరమైనా అతని స్థానాన్ని భర్తీ చేసే సత్తా మయాంక్ అగర్వాల్‌కు ఉందని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. నాణ్యమైన ఆటగాళ్లతో తలపడాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ, దురదృష్టవశాత్తు రోహిత్‌కు గాయమైంది. అతనో అద్భుతమైన ప్లేయర్. మా జట్టుపై గత మ్యాచుల్లో ఆధిపత్యం చలాయించాడు. కానీ, అతడు లేకున్నా మయాంక్ ఆ స్థానాన్ని భర్తీ చేయగలడని ఫించ్ ధీమా వ్యక్తం చేశాడు. అతను ఐపీఎల్‌లో రాణించాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు.