అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు మరోసారి కలకలంరేపింది. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీతో దాదాపు 150మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో స్పృహకోల్పోగా పరిశ్రమ ప్రాంగణంలోనే కొందరికి ప్రథమచికిత్స అందచేస్తున్నారు. మరి కొందరని బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయానికి దాదాపు 4వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తుండగా వారిలో 150 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జూన్‌లో సీడ్స్ దుస్తుల కంపెనీ దాని సమీపంలోని పోరస్ లాబ్స్‌ను దాదాపు వారం రోజుల పాటు మూసివేసి ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని ఐఐసీటీ సహా ఇతర అధికారులతో గ్యాస్ లీకేజీపై నివేదికలు తీసుకుంది. కాగా, సీడ్స్‌లో రెండోసారి విషవాయువు లీకేజీ జరగడంపై అధికారులు సమగ్ర పరిశీలన చేయాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆదేశించారు.