నిజజీవితంలో ఆదర్శ దంపతులుగా విజయవంతంగా జీవితాన్ని నడిపిస్తున్నారు సూర్య, జ్యోతిక. వీరిరువురూ జంటగా ఏడు సినిమాలు చేశారు. ఆ తర్వాత ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలసి సినిమా చేయలేదు. వీరిద్దరూ కలిసి మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు? అనే చర్చ నడుస్తూనే ఉంది. ఎవరైనా దర్శకులు మంచి కథతో వస్తే మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి ఎప్పుడూ రెడీనే ’ అని సూర్య పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు కథ కుదిరిందని, పద్నాలుగేళ్ల తర్వాత వీళ్లిద్దరూ స్క్రీన్ మీద కనిపించనున్నారని టాక్.
మలయాళ దర్శకురాలు అంజలీ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పాట్టి’ దర్శకురాలు హలితా షహీమ్తో కలసి అంజలీ మీనన్ కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం. కాగా, ‘సినీ సింగం’ సూర్య, ‘చంద్రముఖి’ జ్యోతిక కాంబినేషన్లో వచ్చే మూవీ గురించి సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.