మధుమేహం వచ్చిందంటే లోపల ఏదో తెలియని అలజడి. బీపీ అయినా అంతే. ఈ రెండూ కూడా శరీరంలో ఇతర జబ్బులను తీసుకొచ్చే జంట సమస్యలు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరి. వ్యాయామం కూడా షుగర్ వ్యాధిని 10 శాతం మేర తగ్గిస్తుందని అంటున్నాయి అధ్యయనాలు.
ఇవి తినాలి: డయాబెటిస్ ఉన్నప్పుడు ఎంత తక్కువ కేలరీలు తీసుకుంటే అంత మంచిది. అందుకే ఆహారంలో నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలు అవసరం. పీచు పదార్థం(Fibrous matter) అధికంగా ఉండే ఆహారం నిదానంగా జీర్ణమవుతుంది. అన్నం తినకూడదని కాదు గానీ దంపుడు బియ్యం ఉత్తమం. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిదానంగా జీర్ణమవుతుంది. అన్నానికి బదులుగా రొట్టె(Chapati) తీసుకోమంటారు గానీ, కేలరీల విషయంలో రెంటికీ పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే రొట్టెలను లెక్కించుకుని ఇన్ని అని తినవచ్చు. అన్నం విషయంలో కూడా రోజూ ఒక కొలత(Measurement) ప్రకారం తీసుకుంటే.. ఏది తిన్నా ఒకటే. చక్కెర శాతం అధికంగా ఉండే ద్రాక్ష, అరటి, మామిడి, సీతాఫలం తినకూడదు. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉండే.. బత్తాయి, జామ, నారింజ, దానిమ్మ, బొప్పాయి ఉత్తమం. మాంసాహారంతో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువ. షుగర్, బీపీలకు ఇది ప్రధాన కారణం. చేపలు(Fish) మంచిదే. మధుమేహం కారణంగా కిడ్నీ(Kidney) దెబ్బతింటే మాత్రం మాంసాహారాన్ని పూర్తిగా మానేయాలి.
ఇలా చేయాలి: షుగర్, బీపీలు ఉన్నా శరీరానికి అవసరమైన పోషకాలను(nutrients) యథావిధిగా తీసుకోవాల్సిందే. రోజుకు మూడు నాలుగుసార్లు పోషకాహారం తీసుకోవాలి. చక్కెరను అదుపు చేయడానికి శారీరక శ్రమ, వ్యాయామం(Exercise) కీలకం. మందులేవీ లేకుండా కేవలం వ్యాయామం ద్వారా చక్కెర దాదాపు 10 శాతం తగ్గేందుకు వీలుంది. మామూలుగా ఆహారం తీసుకుంటూనే వ్యాయామం చేయాలి. మందులు క్రమబద్ధంగా వేసుకుంటున్నాం కదా అని వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాయామం నేరుగా రక్తపోటును, మధుమేహాన్ని(Diabetes) అదుపు చేయలేకపోవచ్చు. కానీ, దీనివల్ల రక్తప్రసరణ బాగా సాగుతుంది.