సిడ్నీ: మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా.. భారత్‌కు 407 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. నాలుగో రోజు ఆటలో భాగంగా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 312/6 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 407 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ముందుంచింది. లబూషేన్(73), స్టీవ్ స్మిత్(81), కామెరూన్ గ్రీన్(84)లు రాణించడంతో పాటు కెప్టెన్ టిమ్ పైన్(39 నాటౌట్) ఆకట్టుకోవడంతో ఆసీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 103/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్.. మరో నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగుల్ని జత చేసింది. ఈ రోజు ఆటలో ఓవర్ నైట్ ఆటగాళ్లు లబూషేన్, స్మిత్‌లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. మూడో వికెట్‌కు స్మిత్-లబూషేన్‌ల జోడి 103 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.
లబూషేన్ మూడో వికెట్‌గా ఔటైన కాసేపటికి వేడ్ కూడా ఔట్ కాగా.. గ్రీన్‌తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆసీస్ స్కోరు 208 పరుగుల స్కోరు వద్ద స్మిత్ ఔటవగా, గ్రీన్ బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే అర్థ శతకం కూడా నమోదు చేశాడు. అతనికి జతగా కెప్టెన్ టిమ్ పైన్ సమయోచితంగా ఆడాడు. ఈ జోడి 104 పరుగుల్ని సాధించడంతో ఆసీస్‌కు మంచి ఆధిక్యం లభించింది. టీమిండియా బౌలర్లలో నవదీప్ సైనీ, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, బుమ్రా, సిరాజ్‌లు చెరో వికెట్ లభించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటవ్వగా, ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది.