సిడ్నీ: భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 375 పరుగులు సాధించింది. లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా(90; 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్ ధావన్(74; 86 బంతుల్లో 10 ఫోర్లు)లు మాత్రమే భారీ హాఫ్ సెంచరీలు సాధించారు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో భాగంగా భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్-శిఖర్ ధావన్‌లు ధాటిగా ప్రారంభించారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌ను మెయింటైన్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 5 ఓవర్లలో 53 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. అయితే హెజిల్‌వుడ్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి మయాంక్(22) ఔటయ్యాడు. ఆఫ్ సైడ్ ఆడబోయిన బంతిని మ్యాక్స్‌వెల్ క్యాచ్‌గా పట్టుకోవడంతో మయాంక్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
మయాంక్ అగర్వాల్ ఔటైన తర్వాత ఫస్ట్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లికి ఆదిలోనే లైఫ్ లభించింది. కోహ్లి కేవలం పరుగు వద్ద ఉండగా షాట్‌కు యత్నించాడు. కమిన్స్ వేసిన ఏడో ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడాడు. అది బ్యాట్‌కు మిడిల్‌కాకపోవడంతో గాల్లోకి లేచింది. ఆ సమయంలో ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆడమ్ జంపా క్యాచ్‌ను పట్టేశాడనుకున్న తరుణంలో వదిలేశాడు. క్యాచ్‌ను పట్టిన తర్వాత సరైన సమయంలో హ్యాండ్స్‌ను మూయకపోవడంతో అది నేలపాలైంది. దాంతో కోహ్లికి లైఫ్ లభించినట్లయ్యింది. కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లి 21 పరుగులు చేసి ఔటయ్యాడు.
హజిల్‌వుడ్ వేసిన 10 ఓవర్ మూడో బంతికి మిడ్‌వికెట్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ ఐదో బంతికి అయ్యర్(2) కూడా ఔటయ్యాడు. దాంతోభారత్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రాహుల్ (12) కూడా నిరాశపరచగా, హార్దిక్-ధావన్‌ల జోడి సమయోచితంగా ఆడింది. ప్రధానంగా హార్దిక్ పాండ్యా తన సహజ సిద్ధమైన శైలిలో దూకుడుగా ఆడాడు. టీ20 ఫార్మాట్ తరహాలో రెచ్చిపోయి 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌలర్ ఎవరనే విషయాన్ని పక్కన పెట్టిన హార్దిక్ బ్యాట్‌ను ఝుళిపించాడు. హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు పాండ్యా. భారీ స్కోరు కావడంతో బంతుల్ని వృథా చేయకుండా రన్‌రేట్‌ను కాపాడుతూ బ్యాట్‌కు పని చెప్పాడు. హార్దిక్ పాండ్యా దెబ్బకు టీమిండియా 26 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
కాగా, ఆ తర్వాత హార్దిక్ కాస్త మెల్లగానే ఆడాడు. సాధ్యమైనంత వరకూ క్రీజ్‌లో ఉండాలనే ఉద్దేశంతో హార్దిక్ తన స్టైల్ ఆటను పక్కకు పెట్టాడు. కానీ కీలక సమయంలో వికెట్ ఇవ్వడంతో టీమిండియా మరొకసారి కష్టాల్లో పడింది. జంపా వేసిన 39 ఓవర్ ఐదో బంతికి స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ ఔటయ్యాడు. దాంతో టీమిండియా 247 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఐదో వికెట్‌గా ధావన్ పెవిలియన్ చేరగా, పాండ్యా ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం రవీంద్ర జడేజా(25) పరుగులు చేయగా, నవదీప్ సైనీ 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(114;124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్(105; 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(69; 76 బంతుల్లో 6 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ రాణించారు. ఆస్ట్రేలియా తొలి వికెట్‌కు, రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయడంతో భారీ స్కోరు సాధించగలిగింది. షమి 3 వికెట్లు సాధించగా.. చాహల్, బుమ్రా, సైనీ తలో వికెట్ తీశారు. అద్భుతమైన సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించిన స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఆదివారం ఇరుజట్ల మధ్య ఇదే వేదికపై రెండో వన్డే జరుగనుంది.