ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న కమలనాథులు ఇప్పడు తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. దక్షిణాదిన కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న బీజేపీ జాతీయ నాయకత్వం పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తోంది. ఇతర పార్టీల్లో ప్రజా, ఆర్థికబలం ఉన్న గెలుపు గుర్రాలను ఆన్వేషిస్తోన్న కాషాయదళం వారిని పార్టీలోకి చేర్చుకుని ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తోంది
శ్రమిస్తే విజయం తథ్యం:
తెలంగాణలో ఈ సారి కొంచెం కష్టపడితే విజయం ఖాయమన్న భావనలో కమలనాథులు ఉన్నారు. గత ఎన్నికల కంటే ఇప్పుడు పార్టీ బలోపేతం చెందడం, అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కలిసోచ్చే అంశాలుగా భావిస్తున్నారు. గతంతో పోలీస్తే ఇప్పడు పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నప్పటికీ మరింత ప్రజా, ఆర్థిక బలం ఉన్న నాయకుల కోసం ఆన్వేషిస్తోంది. అధికార టీఆర్ఎస్ కు చెందిన అసంతృప్త నేతలతో పాటు కాంగ్రెస్‌కు చెందిన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలనే ఆలోచనలో ఉంది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల్లో పార్టీ విజయదుందుబి మోగించడంతో తెలంగాణపైన ప్రభావం చూపుతుందని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అపరేషన్ ఆకర్ష్‌పై దృష్టి సారించారు. పార్టీలో పట్టుకోసం ఎంపీ స్థానాలే టార్గెట్ గా ఆపరేషన్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలలో బలం పెంచుకుంటే అసెంబ్లీ స్థానాలపై కూడా పట్టు సాధించవచ్చని.. తద్వార రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుందన్న యోచనలో జాతీయ నాయకత్వం ఉంది.
పార్లమెంట్ స్థానాలపై కన్ను:
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో 118 చోట్ల పోటీ చేసి కేవలం ఒక స్థానాన్నే కైవసం చేసుకుంది. అంతకుముందున్న 5 స్థానాల్లో నాలుగింటిని కోల్పోయింది. ఆ తరువాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని చరిత్ర
సృష్టించింది. కేవలం ఒక్క స్థానానికే పరిమితమయ్యే బీజేపీ నాలుగింట విజయం సాధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ర్టంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మారిన బీజేపీ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రాష్ర్టంలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది.
జాతీయ నాయకత్వం ఆలచోన కార్యరూపం దాల్చేందుకు బీజేపీకి చాలా చోట్ల బలమైన నేతలు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. దీంతో బలమైన నేతలను పార్టీలోకి తీసుకు రావాలన్న అభిప్రాయానికి వచ్చిన జాతీయ నాయకత్వం ఆ నేతల వేటలో పడింది. ఇప్పటికే చేవెళ్ళ నియోజక వర్గం నుంచి ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నియోజక వర్గంలో గతంలో ఎంపీగా పనిచేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఇప్పటికే పలు మార్లు రాష్ట్ర నాయకత్వం సమావేశం అయినట్టు తెలుస్తోంది. గతంలో ఎంపీగా గెలిచిన అనుభవంతో పాటు ఆ నియోజక వర్గంలో మంచి పట్టున్న నేత , ఆర్థికంగాను ఆయన బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనను సంప్రదించినట్టు తెలుస్తోంది.
ఇక భూవనగిరి ఎంపీ స్థానంలోను పట్టుకోసం ఉద్యమ నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో కేసీఆర్ తో పాటు కీలకంగా పనిచేసిన జిట్టా బాలకృష్ణా రెడ్డి చేరికతో ఆ నియోజక వర్గంలో పార్టీ పట్టు పెరిగిందన్న భావనలో రాష్ర్ట నాయకత్వం ఉంది. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు ఉద్యమకాలం నుంచి ప్రజల్లో ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. దీంతో ఆ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా పార్టీకి బలం పెరిగిందన్న అభిప్రాయంలో ఉన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీకి ఇప్పటికే ఇద్ధరు ప్రజా, ఆర్థిక బలం ఉన్న డీకే.అరుణ, జితేందర్ రెడ్డిలు ఉన్నారు. ఈ స్థానం నుంచి 2014లో టీఆరెస్ తరపున జితేందర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆ పార్టీతో విభేదాల కారణంగా 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు.
గద్వాల ఎమ్మెల్యేగా 2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీమంత్రి డీకే.అరుణ ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహాబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసింది. ఈ ఇద్ధరిలో ఎవరో ఒకరూ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు పార్టీకి అసలు పట్టులేని నల్లగొండ ఎంపీ స్థానంపై కన్నేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజక వర్గంలోనూ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూడా సమావేశం అయినట్టుగా చర్చా సాగుతోంది. వీరితో సమావేశం తరువాత ఆనేత కూడా బీజేపీలో చేరికకు సానుకూలంగా ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టిఆర్ఎస్ ఎంపీ స్థానమైన జహీరాబాద్ పైనా బీజేపీ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలతలు ఈ స్థానంపై ఆశ పెట్టుకోగా జాతీయ నాయకత్వం, మహారాష్ట్ర బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. పరిస్థితులను బట్టి బీజేపీలో చేరితే ఆయనకే టికెట్ ఇచ్చే యోచనలో రాష్ర్ట నాయకత్వం ఉంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలం పెరుగతుందని అంచనలో జాతీయ నాయకత్వం ఉంది.
అభివృద్ధి మంత్రం:
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకు ఉన్న నాలుగు ఎంపీ స్థానాలతో పాటు మిగతా నియోజకవర్గాల్లో బలం పెరిగేలా జాతీయ నాయకత్వం ఇప్పటికే ప్రణాళికలు అమలు చేస్తోంది. పెండిగ్ లో ఉన్న రైల్వే, జాతీయ రహదారుల నిర్మాణాలను వేగవంతం చేస్తోంది. వీటికోసం వేల కోట్ల రూపాయాలు ఇప్పటికే నిదులు విడుదల చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులు పూర్తైతే పార్టీ బలం ఘననీయంగా పెరుగుతుందని అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇక ఏమాత్రం కేడర్ లేని ఖమ్మంలోనూ పట్టుకోసం బీజేపీ నాయకత్వం వేగంగా పావులు కుదుపుతోంది. ఈ నియోజక వర్గంలో టీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు పార్టీలో చేరుతారని చర్చసాగుతోంది. వీరు పార్టీ మారడం ఖాయంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీంతో వీరు బీజేపీ వైపు చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లామొత్తం ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు కమలనాథులు యోచిస్తున్నారు.
వరంగల్ జిల్లా నుంచి బలమైన నేతలు బీజేపీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చర్చలు సఫలం అయ్యాయని త్వరలోనే పార్టీలో చేరుతారని సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వం అమలు చేస్తున్న వ్యూహాం ఏ మేరకు విజయవంతమవుతుంది… తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరముంది.