మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాతో జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ఒక రోజు ముందే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే తొలి టెస్టులో ఓపెనర్‌గా విఫలమైన పృథ్వీ షాను జట్టు మేనేజ్‌మెంట్ పక్కనబెట్టింది. అతని స్థానంలో శుభ్‌మన్ గిల్ తుది జట్టులోకి రాగా.. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేశారు. మొదటి మ్యాచ్‌లో కీపర్‌గా విఫలమైన సాహా స్థానంలో రిషబ్ పంత్‌ను ఎంపికచేయగా.. కేఎల్ రాహుల్‌కు మరోసారి నిరాశే మిగిలింది.
ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజాను ఆల్‌రౌండర్ కోటాలో రెండో టెస్టుకు ఎంపిక చేశారు. ఇక మయాంక్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. వన్‌డౌన్‌లో పుజారా బ్యాటింగ్ చేయనున్నాడు. అజింక్యా రహానే, హనుమ విహారిలు మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నారు. ఇక బుమ్రా ,ఉమేశ్ యాదవ్, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌లు బౌలింగ్ భారం మోయనున్నారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో రహానే మిగిలిన టెస్టులకు నాయకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది. కాగా మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటైన టీమిండియా టెస్టు క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది.
టీమిండియా తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.