హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతోనే హైదరాబాద్ మహానగరానికి బ్రాండ్ ఇమేజ్ వచ్చినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. ఒక్క రోజులో హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుతూ అభివృద్ధిని కోనసాగిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో హైదరాబాద్ సురక్షితమైన నగరమని, భౌగోళికంగా కూడా హైదరాబాద్ అత్యంత సురక్షితమైనదని వెల్లడించారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగిన ‘బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ’ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, అందుకే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఐటీ రంగంలో బెంగళూరు కంటే ఎక్కడ వెనుబడ్డామో పరిశీలించుకుంటున్నామని తెలిపారు. గత ఐదేండ్లలో ఐటీ పెట్టుబడులు రెట్టింపయ్యాయన్నారు. ఐటీ అభివృద్ధికి మానవ వనరులు, ప్రభుత్వ విధానాలు, లాజిస్టిక్స్ అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఐదు ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ను తమ రెండో చిరునామాగా ప్రకటించాయని మంత్రి గుర్తు చేశారు.
వివిధ కంపెనీలు ప్రకటించిన పెట్టుబడుల్లో 40 శాతం కార్యరూపం దాల్చాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న సంస్థలకు అన్నిరకాలుగా భరోసా కల్పించాలని, అవే బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతాయని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. పెట్టుబడిదారులతో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. 2014కు ముందు హైదరాబాద్‌లో అనేక సమస్యలు ఉండేవి. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో వాటిని పరిష్కరిస్తున్నారని తెలిపారు.
అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌కు వచ్చేందుకు అధికారులు ఎంతగానే కృషిచేశారని చెప్పారు. అమెజాన్ మొదట బెంగళూరును ఎంపికచేసుకుందని, అయితే తెలంగాణ ప్రభుత్వ పన్ను విధానాలు నచ్చి అమెజాన్ హైదరాబాద్‌కు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు అమెజాన్ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉందన్నారు. ఐటీ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం అనేక విడతలుగా చర్చలు జరిపిందని, కేవలం ఆరేండ్లలోనే తెలంగాణ స్టార్టప్‌ల పాలిట స్వర్గధామంగా మారిందని వెల్లడించారు. వ్యకిగత జీవితం చాలా స్వల్పమైనది. రాష్ట్రానికి ఏం చేయగలిగామన్నదే ముఖ్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉందని చెప్పారు. జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా తర్వాత ఆరోగ్యంపై అందరిలోనూ అవగాహన పెరిగిందని కేటీఆర్ వెల్లడించారు. హెల్త్‌కేర్ రంగంలో పెట్టుబడులకు ఎంతో అవకాశం ఉందని చెప్పారు. వైద్యరంగంలో సరిపడినన్ని సదుపాయాలు లేవని కరోనా గుర్తు చేసిందన్నారు.
హైదరాబాద్‌లో ప్రస్తుత ఉన్న మౌలిక సౌకర్యాలు సరిపోవని, అందువల్ల వసతులను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. గంతలో విద్యుత్ కోసం ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేశారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. ప్రస్తుతం పరిశ్రలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామన్నారు. దీంతో పరిశ్రమలు కూడా మూడు షిఫ్టుల్లో నడుస్తున్నాయని మంత్రి చెప్పారు.