end

బీఎస్పీ సంచలన నిర్ణయం..

త్వరలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల వేళ పార్టీకి నమ్మకద్రోహం చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి తగిన బుద్ధి చెప్పడానికి పూర్తి శక్తిని వినియోగిస్తామని, కావాలంటే ‘బీజేపీ’కి ఓటు వేయడానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామని మాయవతి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రసంగించిన బీఎస్పీ చీఫ్‌.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. నమ్మించి మోసం చేసిన ఎస్పీకి తగిన బుద్ది చెప్పడానికి బీజేపీకి కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బీజేపీ కాదంటే మరో పార్టీకి ఓటేసి ఎస్పీకి తమ సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. దీన్ని కచ్చితంగా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తామని ఆమె సంచలన ప్రకటన చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ సమాజ్‌వాదీ వ్యవహరించే తీరు సరిగా లేదని మాయావతి తెలిపారు.

1995 జూన్ 2 కేసును తాము వెనక్కి తీసుకుని చాలా పెద్ద తప్పు చేశామనీ, వారితో చేతులు కలపకపోతే బాగుండేదని ఈ సందర్భంగా మాయావతి పేర్కొన్నారు. ఎస్పీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో దిగాలని డిసైడ్ అయినప్పటి నుంచి తమ పార్టీ కార్యకర్తలు విజయం కోసం తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఎస్పీతో పొత్తు పెట్టుకున్న మొదటి రోజు నుంచే 1995 లో సమాజ్‌వాదీపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని నేతలు తమపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారని ఆమె వెల్లడించారు. ఆ కేసును వెనక్కి తీసుకొని తాము పెద్ద తప్పే చేశామని బీఎస్పీ చీఫ్‌ ఈ సందర్భంగా వాపోయారు.

కాగా, త్వరలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రామ్‌జీ గౌతమ్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేలే(ఐదుగురు) ఝలక్‌ ఇచ్చారు. వారు తమ మద్దతు ఉపసంహరించుకొని ఎస్పీతో చేతులు కలపడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు వెల్లడించారు.

Exit mobile version